ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని ఓడిద్దాం

ABN , First Publish Date - 2021-08-21T07:12:59+05:30 IST

బీజేపీపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, 2024 లోక్‌సభ ఎన్నికలే అంతిమ

ఐక్యంగా పోరాడుదాం.. బీజేపీని ఓడిద్దాం

  • కాంగ్రెస్‌ నేతృత్వంలో కార్యాచరణ
  • 2024 లోక్‌సభ ఎన్నికలే ప్రధాన లక్ష్యం
  • ప్రతిపక్షాలతో భేటీలో సోనియా వెల్లడి
  • సెప్టెంబరు 20-30 వరకు ఆందోళనలు
  • 19 ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన
  • సమావేశానికి రాని ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): బీజేపీపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, 2024 లోక్‌సభ ఎన్నికలే అంతిమ లక్ష్యంగా.. ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె 19 ప్రతిపక్ష పార్టీల నేతలతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన చీఫ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, డీఎంకే చీఫ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జేఎంఎం నేత, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. తమ ముందు కలిసి పనిచేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.  ‘‘స్వాతంత్య్ర పోరాట విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని దేశానికి అందిస్తామన్న ఏకైక ఎజెండాతో ప్రణాళికను మొదలు పెట్టాలి. ఇటీవలి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఐక్యతను చాటుకున్నాయి. సభాపక్ష నేతలతో రోజువారీ చర్చలతో సమన్వయంగా పనిచేశాం. భవిష్యత్‌లోనూ పార్లమెంట్‌ సమావేశాల్లో ఐక్యత కొనసాగుతుందని ఆశిద్దాం. విస్తృత రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల చేయాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.


భేషజాలను కట్టిపెట్టి.. ఆదిపత్య పోరులేకుండ పనిచేయాలని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ పిలుపునిచ్చారు. పెగాసస్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని ఈ భేటీలో పాల్గొన్న విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. భేటీ అనంతరం ప్రకటన విడుదల చేశాయి. పెగాస్‌సను ప్రభుత్వం కొనుగోలు చేసిందా? లేదా? అన్నదానిపై సమాధానం రావడం లేదని విమర్శించాయి. రాఫెల్‌ ఒప్పందంపైనా అత్యున్నత దర్యాప్తునకు డిమాండ్‌ చేశాయి.


ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం జాతీయ ఆస్తుల దోపిడీకి పాల్పడుతోందని ఆక్షేపించాయి. బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతోపాటు.. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశాయి. కార్మికుల హక్కులను నీరుగార్చే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని స్పష్టంచేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబరు 20 నుంచి 30 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.


ఇంకా పలు కీలక డిమాండ్లు చేశాయి. అవి..


 కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలి. అంతర్జాతీయ స్థాయిలో టీకాలను కొనుగోలు చేసి ఉచిత వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి. కరోనా మృతుల కుటుంబాలకు సరిపడా నష్టపరిహారాన్ని అందించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కింద వ్యాక్సినేషన్‌ అందజేసి, విద్యాసంస్థలు తెరుచుకోడానికి చర్యలు తీసుకోవాలి


 ఆదాయపు పన్ను పరిధిలో లేని అన్ని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.7500 నగదు బదిలీ చేపట్టాలి. అవసరమైన వారికి నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్‌లను ఉచితంగా పంపిణీ చేయాలి


 పెట్రోల్‌, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీని ఉపసంహరించుకోవాలి. వంట గ్యాస్‌, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలి. ఎంఎ్‌సఎంఈలకు ఉద్ధీపన ప్యాకేజీ ఇవ్వాలి.


 ఉద్యోగాలు కోసం పబ్లిక్‌ పెట్టుబడులు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. 


 బీమా-కోరెగావ్‌, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. రాజద్రోహం వంటి క్రూర చట్టాల వినియోగాన్ని ఆపాలి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఎన్నికలు జరపాలి.




ఆప్‌కు అందని ఆహ్వానం.. బీఎస్పీ, ఎస్పీ గైర్హాజరు

ప్రతిపక్షాల సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)ని ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ, సమాజ్‌వాది పార్టీలను ఆహ్వానించినప్పటికీ ఆ రెండు పార్టీలు గైర్హాజరయ్యాయి. రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఆ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Updated Date - 2021-08-21T07:12:59+05:30 IST