ముంబైని చూసి నేర్చుకోండి : కేంద్రానికి సుప్రీం హితవు

ABN , First Publish Date - 2021-05-05T22:39:07+05:30 IST

కోవిడ్-19 విలయాన్ని ఎదుర్కొనడంలో ముంబై నగర పాలక సంస్థ అనుసరించిన

ముంబైని చూసి నేర్చుకోండి : కేంద్రానికి సుప్రీం హితవు

న్యూఢిల్లీ : కోవిడ్-19 విలయాన్ని ఎదుర్కొనడంలో ముంబై నగర పాలక సంస్థ అనుసరించిన విధానాలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. ముంబైలో అమలు చేసిన పద్ధతులను ఢిల్లీలో ప్రయత్నించి చూడాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆసుపత్రిలో పడకల ప్రాతిపదికపై ఆక్సిజన్ డిమాండ్‌ను లెక్కించడం శాస్త్రీయం కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసును నిలిపేసింది.


కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నగరానికి ఆక్సిజన్ సరఫరాపై అంతకుముందు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంతో, కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని, అధికారులు బుధవారం స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేత‌ృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాపై గురువారం ఉదయం 10.30 గంటలకు సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సవివరమైన ప్రణాళికను సమర్పించేందుకు ఈ గడువును ఇస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముంబైలోని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అనుసరించిన విధానాలను పరిశీలించాలని అధికారులకు తెలిపింది.  కోర్టు ధిక్కార చర్యలు చేపట్టే అధికార పరిధిని వినియోగించడం వల్ల నగరంలోని సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపింది. 


ఢిల్లీకి రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దాదాపుగా సరఫరా చేయడానికి ప్రయత్నించాలని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. రానున్న రోజుల్లో డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్‌ను ఎలా సరఫరా చేస్తారో చెప్పాలని కోరింది. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కోవిడ్-19ను దీటుగా ఎదుర్కొందని సుప్రీంకోర్టు ప్రశంసించడంతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. బీఎంసీ మెచ్చుకోదగిన కృషి చేసిందని కేంద్రం పేర్కొంది. 


రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్వీకరించేందుకు తగిన వసతులు ఢిల్లీ నగరంలో లేవని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో మంగళవారం వాదించింది. కేంద్రం వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రంపై కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ, ఇద్దరు సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారులు తమ సమక్షంలో బుధవారం హాజరు కావాలని ఆదేశించింది.


Updated Date - 2021-05-05T22:39:07+05:30 IST