శ్రీవారి భక్తుల కోసం ఫైబర్‌ షెల్టర్‌

ABN , First Publish Date - 2021-02-01T15:55:36+05:30 IST

2019 సెప్టెంబరులో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. గతంలో కన్నా అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఆలయ అభివృద్ధికి అవసరమైనవన్నీ చేస్తున్నాం. సాధారణంగా రోజుకు 5 వేల మందికి పైగా...

శ్రీవారి భక్తుల కోసం ఫైబర్‌ షెల్టర్‌

ఆలయం బయట క్యూలైన్‌లో నిర్మాణం

తిరుమల వరకూ మధ్యలో సత్రాల నిర్మాణం

13న జీఎన్‌ చెట్టిరోడ్డులో అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన

శ్రీవారి ఆలయం కోసం స్థలాలు సిద్ధం

మేలో అలిపిరి ‘గో మందిరం’ ప్రారంభం

టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌


సలహామండలి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని సంవత్సరం దాటింది. మీరు వచ్చాక ఆలయ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు

 2019 సెప్టెంబరులో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. గతంలో కన్నా అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఆలయ అభివృద్ధికి అవసరమైనవన్నీ చేస్తున్నాం. సాధారణంగా రోజుకు 5 వేల మందికి పైగా భక్తులు వస్తారు. అదే శనివారమైతే 25 వేల నుంచి 30 వేల మంది వరకూ వస్తారు. ఇక పర్వ దినాలు, ప్రత్యేక ఉత్సవాల్లో ఈ ఆ సంఖ్య 70 వేలకు చేరుకుంటుంది. ఆ భక్తులంతా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆహ్లాద కరమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని వెళ్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. స్వామివారి వద్దకు వచ్చిన భక్తుడికి దర్శనానంతరం ఒక సంతృప్తి మిగలాలి. అందుకు ఏమేం అవసరమో అవన్నీ చేస్తున్నాం. ఇంకా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుత ఆలయం లోపల సీలింగ్‌ సాధారణ హాలులా వుంది. కానీ ఆలయం తరహా లో వుండేలా మార్చాలనుకుంటున్నాం. ఇందుకు సినీ కళాకారుడు తోట తరణిని అడిగాం. ఆయన దేశవిదేశాల్లో ఎన్నో ఆలయాలకు డిజైన్లు అందించారు. ఇక ఆలయం వెలుపల రెండు మార్గాల్లో ఉన్న ఇనుప గేట్ల స్థానంలో టేకు ద్వారాలు పెడుతున్నాం. ఆలయ విస్తరణ కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుడి,ఎడమవైపు వున్న నివాసాల వారితో మాట్లాడుతు న్నాం. ఆ ప్రయత్నం ఫలప్రదమైతే ఆలయ విస్తరణ చేద్దామనుకుంటున్నాం. నగరంలో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఇదే ప్రధానమైనది. భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని దీనిని విస్తరించాలనుకుంటు న్నాం. తిరుమల తరహాలోనే ఇక్కడా కల్యాణోత్సవ లడ్డూ, వడ కూడా అందుబాటులో వుంచుతున్నాం. టీటీడీ ముద్రించే పుస్తకాల్లో భక్తులు కోరుకునే అన్నింటినీ ఇక్కడి కి తెప్పించి ఉంచుతున్నాం.  టీటీడీ బోర్డు సభ్యుడు, కళ్లకు ర్చి ఎమ్మెల్యే కుమరగురుతో పాటు మరో ఇద్దరు కలిసి 4.5 ఎకరాల భూమి ఇచ్చారు. అక్కడ ఆలయ నిర్మాణం కోసం మొత్తం సుమారు రూ.25 కోట్లు అవుతుందని అంచనా. అందులో సుమారు రూ.10 కోట్ల వరకూ వారే విరాళాలు సేకరిస్తామన్నారు. ఇప్పటికే కుమరగురు రూ. కోటి అందజేశారు. ఇక ఆలయ నిర్మాణానికయ్యే ఖర్చుపై మరికొంత స్పష్టత రావాల్సి వుంది. దానిపైనా చైర్మన్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నాం.


 సీనియర్‌ నటి కాంచన విరాళంగా ఇచ్చిన స్థలంలో ఆలయ నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది

 టి.నగర్‌ జీఎన్‌ చెట్టిరోడ్డులోని స్థలాన్ని కాంచన కుటుంబం శ్రీవారికి విరాళంగా ఇచ్చింది. త్వరలోనే అక్కడ అమ్మవారి ఆలయం నిర్మించబోతున్నాం. 2020 ఏప్రిల్‌ 9న శంకుస్థాపన జరపాలని అనుకున్నాం. కానీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా అది వాయిదా పడింది. అయితే ఈ నెల 13న అక్కడ అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేస్తున్నాం. కంచి పీఠాధిపతి, టీటీడీ ఈవో, చైర్మన్‌ అందరూ వస్తున్నారు. 


 కానీ ఆ స్థలం ప్రధాన రోడ్డు నుంచి చాలా లోపలికి వుంటుంది. అక్కడ ఆలయం నిర్మిస్తే భక్తుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తదా

వారణాసిలో కాలభైరవ ఆలయానికి రోజుకు 50 వేల మందికి భక్తులు వస్తారు. ఆ ఆలయంలోకి వెళ్లే దారి కేవలం ఐదడుగులే వుంటుంది. అయినా భక్తులు దేశవిదేశాల నుంచి వస్తూనే వున్నారు కదా! భక్తితో వచ్చేవారికి దారి ఒక సమస్య అవుతుందని నేననుకోవడం లేదు. కావాలంటే కొద్దిసేపు వేచివుండి దర్శనం చేసుకుంటారు. అందునా అక్కడ అమ్మవారి ఆలయమే కాబట్టి భక్తులు అంత స్థాయిలో ఉండరేమో! అది పెద్ద సమస్య కాబోదు.


 నగరంలో స్వామివారికి కొత్త ఆలయ నిర్మాణం పనులు ఎక్కడిదాకా వచ్చాయి

నగరంలో కొత్త ఆలయం నిర్మిం చాలన్న ప్రతిపాదన చాలాకాలంగా వుంది. ఈసీఆర్‌రోడ్డు, ఓఎంఆర్‌ రోడ్లలో పదేసి ఎకరాల చొప్పున స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. వాటిల్లో ఏదో ఒకదానిని ఎన్నుకోవాల్సి వుంది. టీటీడీ తరపున ప్రతినిధులు వెళ్లి  అనువైన స్థలం నిర్ణయిస్తే  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా వుంది. ఈ వ్యవహారంలో కొంతకాలంగా జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే కానీ, ఇప్పుడది చివరిదశకు చేరుకుంది.


 ఈ ఆలయానికి వచ్చే భక్తుల క్యూ పెద్దదిగా వుంటోంది. దాంతో వారు స్వామివారి దర్శనం కోసం ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటే బావుంటుందేమో

ఆలయం ఎదురుగా వున్నది పబ్లిక్‌ రోడ్డు. ఇరువైపులా ప్రైవేటు వ్యక్తుల నివాసాలున్నాయి. సొంత స్థలం వుంటే ఏదైనా చేయగలం. అవన్నీ ఇతరులవైనందువల్ల ఏమీ చేయలేపోతున్నాం. కానీ భక్తుల ఇబ్బందుల గురించి మంచి సలహా ఇచ్చారు. శనివారం, ఇతర పర్వదినాలు, ఉత్సవాల సందర్భాల్లోనే భక్తులు భారీగా వస్తారు. అప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ‘మూవ్‌బుల్‌ షెల్టర్‌’ ఏర్పాటు చేయవచ్చు. రోడ్డు వెంట ప్రమాదాలు జరుగకుండా, ఇతరులకు అంతరాయం కలుగకుండా వాటిని వినియోగించవచ్చు. సాయంత్రం సమయాల్లో మళ్లీ వాటిని అక్కడి నుంచి తీసేయవచ్చు. అలాగే చెప్పుల్లేకుండా క్యూలో నిలబడే భక్తుల కాళ్లు కాలకుండానూ తగిన ఏర్పాట్లు చేస్తాం. వెంటనే దీని కోసం చర్యలు తీసుకుంటాం. ఎండ తగలకుండా క్యూ పొడవునా పైన ఫైబర్‌ షెల్టర్‌ వుండేలా ఏర్పాటు చేస్తాం. కింద చక్రలు వుండేలా ఏర్పాటు చేయించి, సాయంత్రానికి దానిని అక్కడి నుంచి తీసేయవచ్చు. (దీనిపై కొటేషన్లు తీసుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాలని అప్పటికప్పుడే తోటి సభ్యులను పురమాయించారు) సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. తొలిప్రాధాన్యం దీనికే. అలాగే ఈలోగా బయట నిలబడే భక్తులను ఆలయ లోపలివైపు నీడ ప్రాంతంలో వుంచేలా చర్యలు తీసుకుంటాం. మంచి సలహా ఇచ్చారు. ఈ క్రెడిట్‌ ‘ఆంధ్రజ్యోతి’దే అవుతుంది. 


చెన్నై నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు.. ఇందుకోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా

ప్రతి 30 కిలోమీటర్లకొక సత్రంలాంటిది కట్టిస్తే భక్తులకు ఇబ్బంది లేకుండా వుంటుంది. అక్కడే వంటగది లాంటివీ ఏర్పాటు చేయాల్సివుంటుంది. ముందుగా ఎక్క డెక్కడ కట్టాలో నిర్ణయించుకుంటే ఆయా ప్రాంతాల్లో భక్తు ల నుంచి స్థలాన్ని విరాళంగా తీసుకోవచ్చు. స్వామివారికి విరాళమిచ్చే భక్తులకు కొదువలేదు. దీని గురించి మనం బహిరంగ ప్రకటన కూడా చేయవచ్చు. ఇప్పటి వరకూ దీనిపై ఆలోచన లేదు. ఇకమీదట ప్రయత్నం చేద్దాం. త్వర లోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తాం.


అలిపిరిలో మీరు నిర్మిస్తున్న ‘గోమందిరం’ నిర్మాణం ఎక్కడిదాకా వచ్చింది

అలిపిరిలో స్వామివారి పాదాలమండపం పక్కన వున్న సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ‘గో మందిరం’ ఏర్పా టు చేశాం. గోపూజ చేశాక స్వామివారి దర్శనం చేసుకుం టే మహా పుణ్యమని పెద్దలు చెబుతారు. ఆ ఉద్దేశంతోనే అక్కడ గో మందిరాన్ని ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇలాం టిది తొలిసారి. 2014లో నేను బోర్డు సభ్యునిగా వున్నప్పు డు ఈ అంశం చర్చకు వచ్చింది. ఎవరో దుబాయ్‌ వ్యక్తి విరాళమిస్తారని చెబితే నేనే దానిని నిర్మిస్తానని సొంత ఖర్చుతో ఏర్పాటు చేశాను. మొత్తం రూ.13 కోట్లతో దానిని ఏర్పాటు చేశాం. అక్కడే ‘గో తులాభారం’ కూడా ఏర్పాటు చేశాం. ఇలాంటి గో తులాభారం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒకపక్క గోవును పెట్టి, దాని బరువుకు సమానంగా నాణేలు, లేదా బెల్లం, బియ్యం వంటి వస్తువులను భక్తులు ఇస్తారు. అక్కడ వచ్చే డబ్బులు, వస్తువులన్నీ దేవస్థానా నికే వెళ్తాయి. కేవలం మాది నిర్వహణ మాత్రమే. మరో నెలలో ఆ పనున్నీ పూర్తవుతాయనుకుంటాను. మేలో దాని ప్రారంభోత్సవం వుంటుంది. 


మీరు నేరుగా టీటీడీ బోర్డు సభ్యుడు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది

బోర్డులో వున్నామా లేదా అన్నది నేనెప్పుడూ పట్టించుకోను. అదంతా సీఎం ఇష్టం. ఇప్పుడు ఈ పదవి ఇచ్చినందుకు నేను ఆయనకు అజన్మాంతం రుణపడివుం టాను. ఎంతోమంది ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. దేవుడి దయవల్ల అవన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నాకు ఇంతపెద్ద హోదా ఇచ్చారు. ఆయన ఏ పని అప్పగించినా దానిని పూర్తిగా నెరవేర్చడమే నా బాధ్యత. ఎక్కడ వున్నా, ఎలా వున్నా స్వామి వారికి సేవ చేసుకోవడంలోనే నాకు ఆనందం. కన్నియకుమారిలో ఆలయ నిర్మాణం కోసం అనుమతులు రావడంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు నేను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వాటన్నింటినీ పరిష్కరించాను. అప్పుడు టీటీడీలో నాకెలాంటి పదవులు లేవు. అప్పుడూ రేయింబవళ్లు పని చేశాను. ఇప్పుడూ చేస్తున్నాను. ఇవన్నీ నేనెన్నడూ చెప్పుకోలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అంతే. 


రాజధాని నగరం టి.నగర్‌, వెంకటనారాయణరోడ్డులో వున్న శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు, టీటీడీ బోర్డు ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ఏజే శేఖర్‌ వెల్లడించారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భక్తులకు అవసరమైన సదుపాయాలను, వాటి ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ‘ఫైబర్‌ షెల్టర్‌’ ఏర్పాటు చేస్తామని, దీనిని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆలయం లోపల పైకప్పులోనూ మార్పులు చేస్తున్నామన్నారు. ఆలయం వెలుపల వుండే ఇనుపగేట్లకు బదులుగా టేకు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు రాత్రిపూట ఎక్కడుండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటామన్నారు. టీటీడీ ముద్రించే పుస్తకాలన్నింటినీ చెన్నై ఆలయంలోనూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీఎన్‌ చెట్టిరోడ్డులో సీనియర్‌ నటి కాంచన కుటుంబం ఇచ్చిన స్థలంలో ఈ నెల 13వ తేదీన అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుందని వివరించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు మీ కోసం..

- ఆంధ్రజ్యోతి, చెన్నై 

Updated Date - 2021-02-01T15:55:36+05:30 IST