బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కృపాల్ సింగ్

ABN , First Publish Date - 2021-11-24T00:51:00+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి చిన్నపాటి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధినేత కృపాల్ సింగ్ పర్మార్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది..

బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కృపాల్ సింగ్

షిమ్లా: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి చిన్నపాటి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధినేత కృపాల్ సింగ్ పర్మార్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. బీజేపీకి చెందిన ఒక లోక్‌సభ సీటును, ఒక అసెంబ్లీ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ మరుక్షణం నుంచే పార్టీ రాష్ట్ర అధినేతను మార్చబోతున్నట్లు బీజేపీలో చర్చ ప్రారంభమైంది. ముందు నుంచి వస్తున్న పుకార్ల ప్రకారమే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మారబోతున్నారు. అయితే పార్టీ అధిష్టానం మార్చకుండా తానే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పర్మార్ ప్రకటించారు. దీనికి తగు కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొద్ది సంవత్సరాలుగా పార్టీని తాను సరిగా నడిపించలేకపోయాయని ఆయన వివరణ ఇచ్చుకొచ్చారు. అయితే పర్మార్ వివరణ ఇచ్చినప్పటికీ అధిష్టానం ఒత్తిడి మేరకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. పక్క రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అనతి కాలంలోనే ముగ్గురు ముఖ్యమంత్రుల్ని బీజేపీ మార్చింది. ఇదే తంతు రాష్ట్రంలో కూడా కొనసాగొచ్చనే అంచనాలు స్థానిక నేతల్లో ఉన్నాయి. దానికి తోడు ఉప ఎన్నికల ఓటమితో సమయం కలిసి రావడంతో పార్టీ అధినేత మార్పు జరిగిందని విమర్శకులు అంటున్నారు.

Updated Date - 2021-11-24T00:51:00+05:30 IST