కేంద్రం మదిలో కొవిడ్ సెస్?
ABN , First Publish Date - 2021-01-12T09:21:05+05:30 IST
బడ్జెట్ సమీపిస్తున్న వేళ సంపన్నులపై అదనంగా కొవిడ్ సెస్ లేదా సర్‌చార్జీని విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా

సంపన్నులపై వసూలుకు యోచన.. ఇంధనాలపైనా మరింత బాదుడు!
న్యూఢిల్లీ, జనవరి 11: బడ్జెట్ సమీపిస్తున్న వేళ సంపన్నులపై అదనంగా కొవిడ్ సెస్ లేదా సర్‌చార్జీని విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరిగింది. మరోవైపు కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. గత ఏడాదిలో కొవిడ్ దెబ్బతో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాబడిని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా సంపన్నులపై సెస్‌ను విధించడంతోపాటు ఇంధనాలపై అదనపు సెస్, పరోక్ష పన్నుల పెంపు వంటివి ప్రాథమికంగా చర్చకు వచ్చినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం కొవిడ్ సెస్‌ను అమలు చేస్తే ప్రభుత్వ రాబడి పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర సెస్ వసూళ్లను రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కొవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఇలాంటి తరుణంలో కొత్త పన్నులు విధించవద్దని భారత పరిశ్రమ ఇప్పటికే ప్రభుత్వానికి సూచనలు చేసింది.