Kangana Ranautకు కూ యాప్ స్వాగతం

ABN , First Publish Date - 2021-05-05T19:26:15+05:30 IST

బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్

Kangana Ranautకు కూ యాప్ స్వాగతం

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ స్వాగతం పలికింది. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన నేపథ్యంలో కూ ఆమెను ఆహ్వానించింది. 


తన ట్విటర్ అకౌంట్‌ను ట్విటర్ శాశ్వతంగా నిలిపేసిన తర్వాత కంగన రనౌత్ మాట్లాడుతూ, తనకు చాలా వేదికలు ఉన్నాయని, తన భావాలను ప్రజలకు తెలియజేయగలనని చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె నిబంధనలను ఉల్లంఘిస్తూ పదే పదే ట్వీట్లు చేస్తున్నారని ట్విటర్ ఆరోపిస్తోంది. 


కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది. తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం కల్పిస్తుందని దీని వ్యవస్థాపకులు ప్రకటించారు. ‘‘ఇది మీ ఇల్లు’’ వంటిది అని కంగనను వీరు స్వాగతించారు. 


కూ యాప్‌లో కంగన రనౌత్ ఫిబ్రవరిలో చేరారు. ఆమె ఈ యాప్‌లో ఇచ్చిన తొలి ‘కూ’ను కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ షేర్ చేశారు. ‘‘ఇది @kanganarofficial మొదటి కూ. కూ తన ఇల్లు వంటిదని, మిగిలినవన్నీ అద్దెకు తీసుకున్నవేనని ఆమె చెప్పడం సరైనదే’’ అని పేర్కొన్నారు. 


కంగన ఇచ్చిన తొలి ‘కూ’లో, ‘‘రాత్రి వేళల్లో పని చేసే ‘ధాకడ్’ సిబ్బందికి ఇది లంచ్ బ్రేక్. ఇప్పుడు కూ ఎందుకు వాడకూడదు? ఇది కొత్త వేదిక. ప్రాచుర్యం పొందడానికి సమయం పడుతుంది. అయితే అద్దెకు తీసుకున్న ఇల్లు ఎప్పటికీ సొంతం కాదు. మీ సొంత ఇల్లు ఎప్పటికీ మీదే’’ అని పేర్కొన్నారు. 


కంగన రనౌత్‌కు కూ ఇల్లు వంటిదేనని అప్రమేయ రాధాకృష్ణ పేర్కొన్నారు. కూ వ్యవస్థాపకుల్లో మరొకరు మయాంక్ బిడవాట్కా కూడా కంగన రనౌత్‌కు స్వాగతం పలికారు. ‘‘@kanganarofficial కంగన గారూ, ఇది మీ ఇల్లు. మీరు సగర్వంగా మీ అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తం చేయండి’’ అని ఆహ్వానించారు. 


ఇదిలావుండగా, తన అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించడంపై కంగన స్పందిస్తూ, తన అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయడానికి తనకు చాలా వేదికలు ఉన్నాయన్నారు. ట్విటర్‌ యాజమాన్యం అమెరికన్లని, బ్రౌన్ పీపుల్‌ను బానిసలుగా చేసుకునే హక్కు తమకు పుట్టుకతోనే ఉందని శ్వేత జాతీయులు భావిస్తారని అన్నారు. తన వాదనను ట్విటర్ రుజువు చేసిందని చెప్పారు. మనం ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో, ఏం చేయాలో చెప్పాలని వాళ్ళు కోరుకుంటారని అన్నారు. అదృష్టవశాత్తూ తనకు చాలా వేదికలు ఉన్నాయని, తన కళకు సంబంధించిన సినిమా ద్వారా కూడా తాను ప్రజలతో మాట్లాడగలనని చెప్పారు. తన గళాన్ని అనేక వేదికల ద్వారా వినిపిస్తానని చెప్పారు. 


Updated Date - 2021-05-05T19:26:15+05:30 IST