మదర్‌ థెరిసా చారిటీ ఖాతాల స్తంభన

ABN , First Publish Date - 2021-12-28T06:49:56+05:30 IST

మదర్‌ థెరిసా ఏర్పాటు చేసిన మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ(ఎంఓసీ) బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...

మదర్‌ థెరిసా చారిటీ ఖాతాల స్తంభన

కేంద్రం నిర్ణయంతో షాక్‌ అయ్యా: మమత 

అంతా బాగానే ఉంది: గ్రూప్‌ అధికార ప్రతినిధి 


కోల్‌కతా/న్యూఢిల్లీ, డిసెంబరు 27: మదర్‌ థెరిసా ఏర్పాటు చేసిన మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ(ఎంఓసీ) బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. క్రిస్మస్‌ సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో షాక్‌ అయ్యానన్నారు. ఈ చర్యతో కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలోని 22వేల మంది రోగులు, ఉద్యోగులకు ఆహారం, మందులు లేకుండా పోయాయని సోమవారం చేసిన ట్వీట్‌లో మమత మండిపడ్డారు.


చట్టం చాలా ప్రధానమైనదే అయినప్పటికీ, మానవతా ప్రయత్నాల్లో రాజీ పడకూడదన్నారు. కాగా, మమత ఆరోపణలపై ఆ గ్రూప్‌ అధికార ప్రతినిధి సునీతా కుమార్‌ స్పందించారు. ఈ విషయం గురించి తనకేమీ సమాచారం లేదని, పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ప్రభుత్వం తమకేమీ చెప్పలేదని, బ్యాంకు లావాదేవీలు బాగానే సాగుతున్నాయని వివరించారు. ఇదిలా ఉండగా, ఎంవోసీకి చెందిన బ్యాంకు ఖాతాలేవీ తాము స్తంభింపజేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే తమ ఖాతాలను స్తంభింపజేయాలని కోరుతూ ఆ గ్రూపు నుంచే అభ్యర్థన అందినట్లుగా ఎస్‌బీఐ వెల్లడించిందని వివరించింది. అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) రిజిస్ర్టేషన్‌ పునరుద్ధరణ కోసం ఎంవోసీ చేసుకున్న దరఖాస్తును ఈ నెల 25న తిరస్కరించినట్లు తెలిపింది. 

Updated Date - 2021-12-28T06:49:56+05:30 IST