కొలీజియం వ్యవస్థను పునస్సమీక్షించాలి

ABN , First Publish Date - 2021-12-08T07:33:58+05:30 IST

న్యాయవ్యవస్థలో ఖాళీలు, కేసులు పేరుకుపోవడంపై లోక్‌సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు...

కొలీజియం వ్యవస్థను పునస్సమీక్షించాలి

జాతీయ న్యాయనియామకాల కమిషన్‌.. బిల్లును మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలి

 హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్‌ వయసును సుప్రీం జడ్జీలతో సమానంగా పెంచాలి

 జడ్జీల పెన్షన్‌ పెంపునకు సంబంధించి 

 బిల్లుపై చర్చలో పలు పార్టీల ఎంపీలు


న్యూఢిల్లీ, డిసెంబరు 7: న్యాయవ్యవస్థలో ఖాళీలు, కేసులు పేరుకుపోవడంపై లోక్‌సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను పునస్సమీక్షించాలని కోరారు. అంతేకాదు.. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసును(62) సుప్రీంకోర్టు జడ్జీల తో సమానంగా 65 ఏళ్లకు పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల పెన్షన్‌ను ఎప్పుడెప్పుడు పెంచాలనే అంశంపై స్పష్టత ఇచ్చే క్రమంలో భాగంగా ఇప్పటికే ఉన్న రెండు చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం ‘హైకోర్ట్‌ అండ్‌ సుప్రీం కోర్ట్‌ జడ్జెస్‌(శాలరీస్‌ అండ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌) ఎమెండ్‌మెంట్‌ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలు పార్టీల ఎంపీలు అభిప్రాయాలు తెలిపారు. తొలుత ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెం డింగ్‌లో ఉండడంపైన ఆందోళన వ్యక్తం చేశా రు.


చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భీమాకోరేగావ్‌ కేసు, సొహ్రాబుద్దీన్‌ షేక్‌, ఇష్రాత్‌ జహాన్‌ కేసులను ప్రస్తావించారు. దేశంలోని కోర్టుల్లో నాలుగు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న్యాయమూర్తుల కొరతే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులకు సంబంధించి భారీస్థాయిలో 406 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని.. న్యాయమూర్తుల పదవుల్లో 41ు భర్తీకాకుండా ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును పెంచితే పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని థరూర్‌ అభిప్రాయపడ్డారు. అలాగే, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విచారణలో కూడా అసాధారణ జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. గత ఏడాది కొవిడ్‌ మొదటివేవ్‌ సమయంలో వలస కూలీలు ఎదుర్కొన్న కష్టాలపై దాఖలైన పలు పిటిషన్లను తిరస్కరించడం న్యాయవ్యవస్థ స్పందన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక.. గతంలో తీసుకొచ్చిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)’ బిల్లును కొన్ని మార్పులతో తిరిగి తీసుకురావాలని బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా కోరారు. న్యాయనియామకాలపై కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ఎక్కువ ఉండేలా రూపొందించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక.. కొలీజియం వ్యవస్థను పునస్సమీక్షించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ సభ్యుడు పి.పి.చౌధురి కోరారు.


ఇతరదేశాలతో పోలిస్తే మనదేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పారితోషికాలు తక్కువగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇక.. న్యాయమూర్తులు రిటైర్‌ అయ్యాక వారు వేరే పదవులు స్వీకరించడానికి కొంత సమయం ఉండాలని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఇద్దరు మాజీ సీజేఐలు డిమోట్‌ అయ్యారని.. ఒకరు గవర్నర్‌గా నియమితులైతే, మరొకరు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయసును కూడా పెంచాలని ఆయన కోరారు. అలాగే.. దళిత న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉన్న అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. వైసీపీ ఎంపీ వంగా గీత.. న్యాయ నియామకాలకు సంబంధించి కొలీజియం వ్యవస్థకు బదులు ఎన్‌జేఏసీకి మద్దతు తెలిపారు.

Updated Date - 2021-12-08T07:33:58+05:30 IST