ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచిన కేజ్రీవాల్ కేబినెట్

ABN , First Publish Date - 2021-08-04T00:21:47+05:30 IST

శాసన సభ్యుల జీతాలను భారీగా పెంచేందుకు ముఖ్యమంత్రి

ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచిన కేజ్రీవాల్ కేబినెట్

న్యూఢిల్లీ : శాసన సభ్యుల జీతాలను భారీగా పెంచేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాల శాసన సభ్యులతో సమానంగా జీతాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన మర్నాడే ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం తన ఎమ్మెల్యేల జీతాన్ని నెలకు రూ.12,000 నుంచి రూ.30,000కు పెంచుతూ తీర్మానించింది. ఈ పెంపు సైతం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా జరిగింది. ఇప్పటికీ దేశంలో తక్కువ వేతనాలు పొందే ఎమ్మెల్యేల జాబితాలో తమ శాసన సభ్యులు కొనసాగుతారని కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పింది. 


ఢిల్లీ శాసన సభ్యుల నెల జీతాలను పదేళ్ళ నుంచి పెంచలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలతో సమానంగా జీతాలు, వేతనాలు ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేజ్రీవాల్ ప్రభుత్వం కోరింది. ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నెలకు పారితోషికాన్ని రూ.2.10 లక్షలకు పెంచుతూ 2015 డిసెంబరులో ఢిల్లీ శాసన సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సంబంధిత అధికారుల అనుమతి పొందకపోవడంతో అది చెల్లలేదు. ఢిల్లీ శాసన సభలో ఒక్కొక్క ఎమ్మెల్యే జీతం నెలకు రూ.30,000 కన్నా మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. 


రాష్ట్ర ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు రూ.53,000 అందుతోంది. జీతం రూపంలో లభించే రూ.12,000 దీనిలో భాగమే. ప్రస్తుతం ఈ జీతాన్ని నెలకు రూ.30,000కు పెంచారు. అలవెన్సులను రూ.60,000కు పెంచారు. మొత్తం మీద ఒక్కొక్కరికి నెలకు రూ.90,000 లభిస్తుంది. 


Updated Date - 2021-08-04T00:21:47+05:30 IST