కర్ణాటకలో.. అప్ప వారసుడెవరో..?

ABN , First Publish Date - 2021-07-24T16:41:54+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడం ఖరారయింది. కానీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి యడియూరప్ప రెండేళ్ల పాలనపై ‘సాధన’ పేరిట

కర్ణాటకలో.. అప్ప వారసుడెవరో..?

ఇంకా తేలని కొత్త ముఖ్యమంత్రి 

- ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు 

- ఏ క్షణంలోనైనా నగరానికి అరుణ్‌సింగ్‌ 

- నగరంలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటన


బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడం ఖరారయింది. కానీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి యడియూరప్ప రెండేళ్ల పాలనపై ‘సాధన’ పేరిట విధానసౌధలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. అదే రోజునే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా అధిష్ఠానం తేల్చలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డజను మందిలో పలువురు హస్తినకు చేరారు. తమ గాడ్‌ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి లేదంటే కేబినెట్‌లో కీలక హోదాలైనా పొందవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రెండురోజులుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేరు వినిపించినా శుక్రవారం సాయంత్రం నాటికి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బెంగళూరు వెళ్లాలని ఆయనను అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. పర్యవేక్షకుడిగా వచ్చే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దూరమైందనిపిస్తోంది. ప్రహ్లాద్‌జోషి ఇప్పటికే కేంద్రంలో కీలకమంత్రి పదవిలో ఉన్నందున ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పంపుతారా..? అనే అంశం కూడా ఢిల్లీలో చర్చకు కారణమవుతోంది. పార్లమెంటు సమావేశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీగా ఉండడంతో కర్ణాటక అంశంపై చర్చించలేదని సమాచారం. శనివారం కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆర్‌ఎ్‌సఎస్‌ కీలకులకు అధిష్ఠానం పిలుపునిచ్చింది. దీంతో హుటాహుటిన పలువురు ఢిల్లీ బయల్దేరారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రాజీనామా కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం లెజిస్లేటర్‌ భేటీ వంటి కీలకమైన అంశాలు ఉన్నందున పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ బెంగళూరుకు రానున్నారు. ఆయన ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగించరాదని రెండురోజులపాటు స్వామిజీలు, ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఆందోళనకు సిద్ధం కాగా అంతలోనే యడియూరప్పే జోక్యం చేసుకుని ఎవరూ అటువంటి నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు. దీంతో స్వామిజీలు సైతం ఒక్కసారిగా మౌనం వహించారు. అయినా యడియూరప్పకు 250 మందికి పైగానే స్వామిజీలు మద్దతు ఇచ్చారు. అయితే ఆయన అభిమానులు ఒక్కసారిగా మౌనం పాటించడమే కాక ఆయనకు ఆప్తులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలు సైతం నోరు తెరవకపోవడం విశేషం. ఏక్షణంలోనై ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరినీ సమన్వయపరిచే వ్యక్తి కోసం అధిష్ఠానం కసరత్తు సాగిస్తోంది. అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాల ఆదేశాలను వ్యతిరేకించి మాట్లాడేవారు లేరనేది తెలిసిందే. కేబినెట్‌లో మార్పులు ప్రస్తుతానికి ఉండవని కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని కోల్పోతున్న యడియూరప్ప మాత్రం అభివృద్ధి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. శుక్రవారం సిటీ రౌండ్స్‌ పేరిట బెంగళూరులో స్మార్ట్‌సిటీ వర్క్స్‌ను పరిశీలించారు. మధ్యాహ్నం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో వరదలు, వర్షాల పరిస్థితిపై సమీక్ష జరిపారు. సీఎం వెంట రెవెన్యూ మంత్రి అశోక్‌, బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T16:41:54+05:30 IST