తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ లలిత బదిలీ
ABN , First Publish Date - 2021-10-29T08:28:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితాకుమారి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితాకుమారి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెంలో జన్మించిన ఆమె 1994లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, పన్నులు వంటి అంశాలకు సంబంధించిన కేసులను వాదించారు. నిరుడు మే 2న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, రాజస్థాన్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు, పంజాబ్-హరియాణ హైకోర్టుకు ఐదుగురు అదనపు న్యాయమూర్తులను నియమించాలని కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు.