ఇలాగైతే Chennai మునగడం ఖాయం!
ABN , First Publish Date - 2021-12-31T16:54:33+05:30 IST
టన్నులకొద్దీ పేరుకుపోతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను విభజించి తొలగించేందుకు తగు చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర రాజధాని నగరం చెన్నై నీట మునగటం ఖాయమని జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర పర్యవేక్షక కమిటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ పి. జ్యోతిమణి

- జస్టిస్ జ్యోతిమణి హెచ్చరిక
చెన్నై: టన్నులకొద్దీ పేరుకుపోతున్న చెత్తాచెదారం, వ్యర్థాలను విభజించి తొలగించేందుకు తగు చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర రాజధాని నగరం చెన్నై నీట మునగటం ఖాయమని జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర పర్యవేక్షక కమిటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ పి. జ్యోతిమణి హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ పథకం అమలుపై ఆయన రాష్ట్రవ్యాప్తంగా పరిశీలనలు జరుపుతున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన రాణిపేట జిల్లాల్లో చెత్తాచెదారాల తొలగింపు, వ్యర్థాల నిర్వహణ అమలు తీరుపై గురువారం ఆయన పరిశీలించారు. రాణిపేట పురపాలక సంఘం పరిధిలో వ్యర్థాల తొలగింపు పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుండటం పట్ల జస్టిస్ జ్యోతిమణి హర్షం ప్రకటించారు. వ్యర్థాల నిర్వహణ పథకం ద్వారా జరిగే మేలు ఎటువంటిందంటే ఆయా ప్రాంతాల్లో సేకరించే చెత్తాచెదారాల్లో 60 శాతం మగ్గే చెత్తాచెదారాన్ని, 40 శాతం మగ్గడానికి వీలులేని చెత్తాచెదారాన్ని విభజించగలమని ఆయన వివరించారు. చెన్నైకి సంబంధించినంతవరకూ ఈ చెత్త విభజన సక్రమంగా జరగటం లేదని చెప్పారు. ఇళ్ళలోనివారే మగ్గిపోయేందుకు అనువుగా వున్న చెత్తను వేరుగా అందజేస్తే ఎలాంటి ముప్పు వాటిల్లడానికి అవకాశం ఉండదన్నారు. ఈ విషయమై తాను పది రోజులకు ముందు ముఖ్యమంత్రిని కలుసుకుని ఓ నివేదికను కూడా సమర్పించానని చెప్పారు. వ్యర్థాల నిర్వహణ పథకాలను సక్రమంగా అమలు చేయకపోతే వాణిజ్యనగరమైన కోయంబత్తూరు, చెన్నై నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో హెచ్చరించారనన్నారు. రాణిపేట పురపాలక సంఘంలో 95 శాతం చెత్తాచెదారాన్ని మగ్గే చెత్తగా, మగ్గని చెత్తగా విభజించడం అభినందనీయనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులకు, ఉష్ణోగ్రత అధికం కావటానికి 16 శాతం వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం ప్రధాన కారణమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారని, దీనికి తోడు కడలి ఉష్ణోగ్రత 1.5 శాతం నుండి రెండు శాతానికి పెరిగితే చెన్నై నగరం సమీప భవిష్యత్తులో సముద్రంలో మునిగే ప్రమాదం ఉందన్నారు. కొల్‌కతానగరం కూడా వ్యర్థాల నిర్వహణ పథకాలను సక్రమంగా అమలు చేయనట్టయితే ఆ నగరం పూర్తిగా నీట మునుగుతుందన్నారు. ఇళ్లలోనే 100 శాతం చెత్తకుప్పలను విభజించి అందించాలనే చట్టం కూడా వుందని ఆయన చెప్పారు.