ప్రతిపక్షాలు క్వారంటైన్‌లో ఉన్నాయి : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-05-30T21:29:17+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రతిపక్షాలు ప్రజాసేవ చేయకుండా

ప్రతిపక్షాలు క్వారంటైన్‌లో ఉన్నాయి : జేపీ నడ్డా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రతిపక్షాలు ప్రజాసేవ చేయకుండా, క్వారంటైన్‌లో ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడేళ్ళ పాలన వార్షికోత్సవాల సందర్భంగా జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో ఆదివారం మాట్లాడారు.  


కోవిడ్-19 మహమ్మారి సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు సహాయపడేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం క్వారంటైన్‌లో గడుపుతున్నాయన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం వర్చువల్ విలేకర్ల సమావేశాల్లోనే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు చాలా ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. ‘మోదీ వ్యాక్సిన్’ అంటూ వ్యాక్సిన్లపై రాద్దాంతం చేశారని, ఇప్పుడు వ్యాక్సిన్లు కావాలంటూ గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. నెలకు 1.3 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ అక్టోబరు నాటికి తన సామర్థ్యాన్ని నెలకు 10 కోట్ల డోసులకు పెంచుకుంటుందని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఏడేళ్ళు పూర్తయిన సందర్భంగా మే 30న సేవా దినోత్సవాలను బీజేపీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా లక్ష గ్రామాల్లో ప్రజలకు రేషన్ సరుకులు, శానిటైజర్లు వంటివాటిని పంపిణీ చేయాలని కార్యకర్తలు, నేతలను ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు ఒక్కొక్కరూ రెండేసి గ్రామాల చొప్పున పర్యటించాలని బీజేపీ ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా హాజరు కావచ్చునని తెలిపింది.  


జేపీ నడ్డా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ళ పాలన వార్షికోత్సవాల సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఎన్డీయే కూటమి పక్షాలకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ రోజును సేవా దినోత్సవంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. నేడు కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు లక్ష గ్రామాల్లో ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 


Updated Date - 2021-05-30T21:29:17+05:30 IST