జార్ఖండ్‌లో లీటరు పెట్రోలుపై రూ.25 తగ్గింపు
ABN , First Publish Date - 2021-12-30T07:30:17+05:30 IST
పెట్రోధరలు ఆకాశాన్నంటి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు జార్ఖండ్ సర్కారు ఊరటనిచ్చింది. పెట్రోలు ధరను లీటరుకు రూ.25 ..

తెల్లకార్డున్న ద్విచక్రవాహనదారులకే.. 26 నుంచి అమల్లోకి
రాంచి, డిసెంబరు 29 : పెట్రోధరలు ఆకాశాన్నంటి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు జార్ఖండ్ సర్కారు ఊరటనిచ్చింది. పెట్రోలు ధరను లీటరుకు రూ.25 మేర తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రకటించారు. అయితే ఈ సదవకాశం ద్విచక్రవాహనాలకు మాత్రమే పరిమితం. ‘పెరిగిన పెట్రోధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్రవాహనాలు ఉన్నా.. ఆ భారాన్ని మోయలేక వాటిని వినియోగించలేకపోతున్నారు. ఆఖరికి వ్యవసాయోత్పత్తులను కూడా మార్కెట్‌కు తీసుకుని వెళ్లి అమ్మలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెల్లకార్డు ఉన్న మోటార్‌సైకిల్, స్కూటర్ యజమానులకు వచ్చేనెల 26 నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి సొరేన్ ట్విటర్‌లో తెలిపారు. అలాంటివారు పెట్రోల్ పోయించుకుంటే.. ప్రస్తుతం ఉన్న ధర మొత్తాన్ని చెల్లించాలి. ఆపై ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ రూ.25 వారి బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ అవుతుంది. ఓ కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా సొరేన్ ఈ ప్రకటన చేశారు. జార్ఖండ్‌లో లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.98.48గా ఉంది.