టిబెట్ సమస్య పరిష్కారానికి జపాన్ నేతల హామీ

ABN , First Publish Date - 2021-05-21T23:27:05+05:30 IST

టిబెట్ సమస్య పరిష్కారానికి ముమ్మరంగా కృషి చేస్తామని జపాన్

టిబెట్ సమస్య పరిష్కారానికి జపాన్ నేతల హామీ

టోక్యో : టిబెట్ సమస్య పరిష్కారానికి ముమ్మరంగా కృషి చేస్తామని జపాన్ చట్ట సభల సభ్యులు హామీ ఇచ్చారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పెన్‌పా త్సేరింగ్‌ను అభినందించారు. జపాన్ మాజీ విద్యా శాఖ మంత్రి, టిబెట్‌కు మద్దతిస్తున్న అఖిల పక్ష జపనీస్ పార్లమెంట్ సభ్యుల గ్రూప్ చైర్మన్ షిమొముర ఈ మేరకు ఓ సందేశాన్ని పంపించారు. 


టిబెట్ సమస్య పరిష్కారం కోసం సార్వత్రిక స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, న్యాయ నియమాల విలువలను గౌరవించే దేశాల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. గత పదేళ్ళలో చురుగ్గా సేవలందించి, పదవీ విరమణ చేయబోతున్న టిబెట్ అధ్యక్షుడు లోబ్సంగ్ సంగేయ్‌కి ధన్యవాదాలు తెలిపారు. 


సేవ్ టిబెట్ నెట్‌వర్క్ జపాన్ ప్రతినిధి, మాజీ పార్లమెంటు మెంబర్ మకినో సెయిషు కూడా త్సేరింగ్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. త్సేరింగ్ చాలా ముఖ్యమైన బాధ్యతలను చేపట్టబోతున్నారని, ఆయనకు జపాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. 


ప్రవాస టిబెన్ ప్రభుత్వాన్ని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో త్సేరింగ్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఆయనకు 34,324 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి కల్సంగ్ డోర్జీ ఔకత్సంగ్ 28,907 ఓట్లు సాధించారు. టిబెట్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగబోతున్న లోబ్సంగ్ సంగేయ్ తన పదేళ్ళ పదవీ కాలంలో చైనాపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 


టిబెట్‌ను 1950లో చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. దలైలామా వయసు ప్రస్తుతం 85 ఏళ్లు, తాను పునర్జన్మ ఎత్తడంపై 90వ ఏట నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో టిబెటన్ల అస్థిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నాలను చైనా తీవ్రతరం చేసింది. టిబెటన్ల ఆధ్యాత్మిక జీవితాల నుంచి దలైలామాను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. 


Updated Date - 2021-05-21T23:27:05+05:30 IST