జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన

ABN , First Publish Date - 2021-10-24T08:02:02+05:30 IST

‘‘జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతాం. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జరగేఅవకాశం ఉంది. ఆవెంటనే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తాం.

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన

వచ్చే ఏడాది చేస్తాం.. వెంటనే అసెంబ్లీకి ఎన్నికలు

ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: అమిత్‌షా

అమాయకులను చంపుతుంటే ఏంచేస్తున్నారు?

మైనారిటీలపై హింస, మిలిటెన్సీపై ఆగ్రహం

భద్రతపై శ్రీనగర్‌లో ఉన్నత స్థాయి సమీక్ష

13 రోజుల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌పైనా ప్రశ్నలు

లోయలో ఉగ్రవాదం తగ్గిందన్న అధికారులు

ఆ వెంటనే అసెంబ్లీకి ఎన్నికలు: అమిత్‌షా 


శ్రీనగర్‌, అక్టోబరు 23: ‘‘జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతాం. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జరగేఅవకాశం ఉంది. ఆవెంటనే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. ‘‘కొన్ని శక్తులు నియోజకవర్గాల పునర్విభజన వద్దంటున్నాయి. కొత్త సరిహద్దులతో తమ అస్తిత్వం పోతుందనే భయం వారిది. 75 ఏళ్లుగా రాష్ట్రాన్ని మూడు కుటుంబాలే పాలించాయి. మరి 40వేల మంది హత్యలు ఎందుకు జరిగినట్లు? స్వర్గానికి మారుపేరైన కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడమే కేంద్రప్రభుత్వ ధ్యేయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన జమ్మూకశ్మీర్‌ చేరుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం 2019 ఆగస్టులో నిర్వీర్యం చేశాక.. అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొ లిసారి. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించారు. సాయంత్రం యూత్‌క్లబ్‌ల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యువత భవితకు బంగారు బాటలు పడ్డాయన్నారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు యువత ముందుకు రా వాలని పిలుపునిచ్చారు.


అంతకుముందు ఆయన శాంతిభద్రతలపై సమీక్ష సందర్భంగా.. జమ్మూకశ్మీర్‌ లోయలో తీవ్రమవుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం, పాకిస్థాన్‌ వైపు నుంచి చొరబాట్లపై సీరియస్‌ అ య్యారు. గడిచిన 13 రోజులుగా కశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఈ సందర్భంగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? ఎక్కడికక్కడ భద్రత ఉన్నా.. మైనారిటీలపై, వలసదారులపై దాడులను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు?’’ అంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. దీనికి భద్రతా బలగాల ఉన్నతాధికారులు, డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గుముఖం పట్టాయని చెప్పినట్లు.. సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వివరించినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. కాగా.. ఈ ఏడాది జూన్‌ 22న ఉగ్రవాదుల తూటాలకు బలైన ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ దార్‌ కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించారు. పర్వేజ్‌ భార్య ఫాతిమా అఖ్తర్‌కు ప్రభుత్వోద్యోగ నియామక పత్రాన్ని అందించినట్లు అమిత్‌షా ట్వీట్‌ చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌ ప్రజల సమస్యలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని, పైపై మెరుగులు వద్దని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వరుస ట్వీట్లు చేశారు.


కశ్మీరీ పండిట్లు తిరిగిరావడం క్షేమం కాదు: ఫరూఖ్‌ అబ్దుల్లా

కశ్మీరీ పండిట్లు రాష్ట్రానికి తిరిగి రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. శనివారం ఆయన ఇండియాటుడేతో మాట్లాడుతూ.. లోయలో శాంతి సామరస్యాలు నెలకొనాలంటే.. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలన్నారు. అమిత్‌షా తనతో భేటీ అవుతామని చెప్పారని, తానూ అంగీకరించలేదన్నారు.

Updated Date - 2021-10-24T08:02:02+05:30 IST