అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కొవిడ్ కేర్ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-20T12:08:12+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీరులోని ప్రతీ గ్రామ పంచాయతీల్లోనూ కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని...

అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కొవిడ్ కేర్ కేంద్రాలు

శ్రీనగర్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీరులోని ప్రతీ గ్రామ పంచాయతీల్లోనూ కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా డిప్యూటీ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. జమ్మూకశ్మీరులో చాలామంది ఇళ్లలో కొవిడ్ పాజిటివ్ రోగులు క్వారంటైన్ లో ఉండటానికి వసతి లేదని సిన్హా చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయతీలోనూ ఐదు పడకల కొవిడ్ కేర్ కేంద్రాన్ని నెలకొల్పాలని లెఫ్టినెంట్ గవర్నరు ఆదేశించారు. సమీప ఆరోగ్యకేంద్రం అధికారులు, పంచాయతీ ప్రతినిధులతో సంప్రదించి పాఠశాలలు, కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ కార్యాలయాల్లో కొవిడ్ కేర్ సెంటర్లలో ఏర్పాటుకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని అధికారులను కోరారు. 


ప్రతీ కేంద్రంలో కరోనా రోగుల కోసం ఆక్సిజన్ తోడ్పాటుతో పడకలు ఏర్పాటు చేయాలని, దీని కోసం  జిల్లా బడ్జెట్ నుంచి లక్ష రూపాయలు వెచ్చించాలని సిన్హా సూచించారు. ఈ కొవిడ్ కేర్ కేంద్రాలు సమీప ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించాలని కోరారు. కొవిడ్ రోగులను ఆశా కార్మికులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది గుర్తించి కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని సిన్మా ఆదేశించారు. మొబైల్ టెస్టింగ్ వ్యాన్లలో కరోనా పరీక్షలు చేసి రోగులను కొవిడ్ కేర్ కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ఆసుపత్రులకు తరలించాలని లెఫ్టినెంట్ గవర్నరు సిన్హా ఆదేశించారు. 


Updated Date - 2021-05-20T12:08:12+05:30 IST