అదేమీ బీజేపీ సొమ్ము కాదు: నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2021-12-31T22:57:00+05:30 IST

పెర్ఫ్‌ఫ్యూమ్ తయారీదారు పుష్పరాజ్‌ జైన్‌పై యూపీలో ఐటీ అధికారులు జరిపిన దాడిని..

అదేమీ బీజేపీ సొమ్ము కాదు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: పెర్ఫ్‌ఫ్యూమ్ తయారీదారు పుష్పరాజ్‌ జైన్‌పై యూపీలో ఐటీ అధికారులు జరిపిన దాడిని సకాలంలో జరిగిన దాడులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అది బీజేపీ సొమ్మేమీ కాదని చెప్పారు. ఐటీ చర్యను 'యాక్షనబుల్ ఇంటెలిజెన్స్‌'గా ఆమె పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశానంతరం మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఐటీ దాడులు సరైన ప్రదేశంలో, సరైన సమయంలోనే జరిగాయన్నారు.


ఆదాయం పన్ను శాఖ ప్రొఫనలిజంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అనుమానాలు వ్యక్తం చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సూటిగా స్పందించారు. ఈ దాడులు ఆయనకు వణుకుపుట్టిస్తున్నాయా? భయపడుతున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు పెద్దఎత్తున మేట వేసుకున్నట్టు కనిపించడం చూస్తే ''లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు'' ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుందన్నారు. ''ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగి, ముహూర్తం చూసుకుని మరీ దొంగను పట్టుకోవాలంటారా? ఇప్పటికిప్పుడే పట్టుకోవాలంటారా?'' అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.


టెక్స్‌టైల్స్ జీఎస్‌టీ యథాతథం

టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేటు యథాతథంగానే ఉంచాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్‌టీ యథాప్రకారం కొనసాగుతుందని, 12 శాతానికి పెరగడం లేదని చెప్పారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు అంశాన్ని టాక్స్ రేట్ రేషనలైజేషన్ కమిటీకి పంపనున్నామని, ఫిబ్రవరిలో కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆమె చెప్పారు.

Updated Date - 2021-12-31T22:57:00+05:30 IST