అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ట్రస్ట్‌కు ఇషా అంబానీ నియామకం

ABN , First Publish Date - 2021-10-28T20:36:25+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ట్రస్ట్‌కు ఇషా అంబానీ నియామకం

వాషింగ్టన్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్మిత్‌సోనియన్ ఆసియన్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఇది స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌లో భాగం. ఇది ప్రపంచంలో అతి పెద్ద మ్యూజియం, విద్య, పరిశోధనల సముదాయం. ఈ ట్రస్ట్ సభ్యురాలిగా ఆమె నాలుగేళ్ళపాటు వ్యవహరిస్తారు. ఆమె ఈ బోర్డు యువ సభ్యుల్లో ఒకరవుతారు. ఇషాతోపాటు కరోలిన్ బ్రెహ్మ్, పీటర్ కిమ్మెల్మన్‌లను కూడా సభ్యులుగా బోర్డు ప్రకటించింది. 


స్మిత్‌సోనియన్‌కు చెందిన ఆసియన్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్‌లో ఉంది. బోర్డ్ ఆఫ్ రీజెంట్స్‌లో 17 మంది సభ్యులు ఉంటారు. వీరిలో అమెరికా ప్రధాన న్యాయమూర్తి, ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, ఆ దేశ సెనేట్ సభ్యులు ముగ్గురు, ఆ దేశ ప్రతినిధుల సభ సభ్యులు ముగ్గురు, తొమ్మిది మంది పౌరులు ఉంటారు. స్మిత్‌సోనియన్ పరిపాలనా బాధ్యతలను ఈ బోర్డు నిర్వహిస్తుంది. 


నేషనల్ మ్యూజియం (ఆసియన్ ఆర్ట్)ను 1923లో ఫ్రీర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌గా ప్రారంభించారు. దీనిలో నియోలిథిక్ పీరియడ్ నుంచి నేటి కాలానికి చెందిన 45 వేలకు పైగా వస్తువులు, కళాఖండాలు ఉన్నాయి. ఇవి చైనా, జపాన్, కొరియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందినవి. 


భారతీయ, ఆసియా కళలు, సంస్కృతుల పట్ల మరింత అవగాహనను పెంచడానికి, అందరికీ చేరువ చేయడానికి కళలపట్ల ఇషా అంబానీ దార్శనికత, బలమైన ఆకాంక్ష ఉపయోగపడతాయని ఈ ట్రస్ట్ బోర్డు భావిస్తోంది. 



Updated Date - 2021-10-28T20:36:25+05:30 IST