చిన్నారులకు వ్యాక్సిన్‌ సురక్షితమేనా?

ABN , First Publish Date - 2021-05-18T07:53:16+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌లో పంజా విసరడానికి సిద్ధమవుతోంది..! థర్డ్‌వేవ్‌లో చిన్నారులే ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి

చిన్నారులకు వ్యాక్సిన్‌ సురక్షితమేనా?

  • దుష్ప్రభావాలేమీ ఉండవా?.. వేగంగా యాంటీబాడీస్‌ వస్తాయా?!
  • తల్లిదండ్రుల అనుమానాలకు అమెరికా వైద్యురాలి సమాధానాలు


వాషింగ్టన్‌, మే 17: కరోనా థర్డ్‌వేవ్‌లో పంజా విసరడానికి సిద్ధమవుతోంది..! థర్డ్‌వేవ్‌లో చిన్నారులే ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే చిన్నారులు ఓ విద్యా సంవత్సరమంతా బడులకు దూరంగా ఉన్నారు. మళ్లీ బడులు తెరుచుకున్నా.. వారిని స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో.. చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌ ఒక్కటే మన ముందున్న పరిష్కారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఫైజర్‌ టీకానే చిన్నారులకు వేయడానికి అనుమతి ఉంది. కొన్ని నెలల్లోనే ఈ టీకా భారత్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో.. అసలు చిన్నారుల్లో టీకా సురక్షితమేనా? వారిలో దుష్ప్రభావాలు ఉంటాయా? కరోనా తీవ్రత తక్కువగా కనిపించే చిన్నారులకు వ్యాక్సిన్‌ అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు చెందిన డెబీ-ఆన్‌ షిర్లే అనే వర్జీనియా వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, చిన్నారుల్లో అంటువ్యాధుల నిపుణురాలు ఆయా అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఆ వివరాలు..


చిన్నారులపై వ్యాక్సిన్‌ పనిచేస్తుందా?

కౌమార దశ.. అంటే 12-15 ఏళ్ల చిన్నారులకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. 16-25 వయసు వారి మాదిరిగానే చిన్నారుల్లో కూడా ఆశించిన మేర యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. క్లినికల్‌ ట్రయల్స్‌లో కూడా ఇది నిర్ధారణ అయ్యింది.


పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సురక్షితమేనా?

వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనని, కౌమార దశ చిన్నారులపై ఇది సమర్థంగా పనిచేస్తోందని తేలింది. అధ్యయనాలు పూర్తయ్యాకే.. అమెరికా ప్రభుత్వం ఈ ఏజ్‌ గ్రూప్‌ వారికి టీకాలిచ్చేందుకు ఆమోదముద్ర వేసింది.


కరోనా సోకిన చిన్నారుల్లో రిస్క్‌ తక్కువే కదా? అలాంటప్పుడు టీకా అవసరమా?

ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కొవిడ్‌ కొత్త కేసుల్లో.. ఒక వారం సగటులో చిన్నారుల వాటా నాలుగో వంతుగా ఉంది. చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే అయినా.. అమెరికాలో వేల మంది చిన్నారులు కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు 351 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. బడుల్లో వ్యాయామాలు, శారీరక శ్రమ తక్కువగా ఉండే చిన్నారులకు కరోనాతో ముప్పు ఎక్కువ. మరణాలను ఆపాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే పరిష్కారం.


వ్యాక్సిన్‌ వల్ల చిన్నారులపై ప్రతికూల ప్రభావాలు(సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఉంటాయా?

అంత తీవ్రంగా ఏమి ఉండవు. టీకా ఇచ్చిన చోట కొంత వాపు కనిపించడం, నొప్పిగా ఉండడం వంటి ప్రభావాలు సాధారణం. అలసినట్లు కనిపించడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. రెండో డోసు తర్వాత జ్వరం, చలి, కండరాల నొప్పులు వంటివి రావొచ్చు. కరోనా కలిగించే దుష్ప్రభావాల ముందు.. ఇవి చాలా చిన్నవే. ఫైజర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమయంలో.. వృద్ధుల్లో అలెర్జీ వంటి లక్షణాలు కనిపించాయి. కానీ, చిన్నారుల్లో అలాంటివేమి లేవు.


పెద్ద వాళ్లు వ్యాక్సిన్‌ వేసుకుంటే.. టీకాలోని వైరస్‌ చిన్నారులకు సోకే ప్రమాదముందా?

అలా ఉండదు. చనిపోయిన లేదా తీవ్ర ప్రభావాలు కలిగించే జన్యువులను తొలగించిన వైరస్‌ వ్యాక్సిన్‌లో ఉంటుంది. టీకాను చాలా తక్కువ మొత్తంలో ఇస్తారు. యాంటీబాడీల ఉత్పత్తికే టీకా వేస్తారు. టీకా తీసుకున్న వారి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందదు. గర్భిణులు వ్యాక్సిన్‌ వేసుకుంటే.. వారి ద్వారా కడుపులో ఉండే శిశువులో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న బాలింత ద్వారా.. ఆమె పాలు తాగే శిశువుల్లోనూ ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుంది.

Updated Date - 2021-05-18T07:53:16+05:30 IST