మా సమాచారానికి డబ్బులివ్వండి!

ABN , First Publish Date - 2021-02-26T09:34:59+05:30 IST

పత్రికల్లో సమాచారాన్ని వాడుకుంటున్నందుకు గాను భారతీయ వార్తా పత్రికలకు పరిహారం చెల్లించాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) గూగుల్‌ సంస్థను

మా సమాచారానికి డబ్బులివ్వండి!

  • గూగుల్‌కు ఐఎన్‌ఎస్‌ లేఖ 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పత్రికల్లో సమాచారాన్ని వాడుకుంటున్నందుకు గాను భారతీయ వార్తా పత్రికలకు పరిహారం చెల్లించాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) గూగుల్‌ సంస్థను కోరింది. ప్రకటనల ఆదాయంలో పబ్లిషర్‌కు ఇచ్చే వాటాను 85 శాతానికి పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.ఆదిమూలం గూగుల్‌కు లేఖ రాశారు. గూగుల్‌ ప్రకటనల విలువకు సంబంధించిన వివరాలేమీ తెలియడం లేదని, దీంతో ప్రకటనల వ్యవస్థ పారదర్శకంగా లేక ప్రచురణకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వార్తా సమాచారానికి ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ప్రకటనల ఆదాయాన్ని సరిగా పంచాలని గడిచిన ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలంతా డిమాండ్‌ చేస్తూనే ఉన్నారని ఐఎన్‌ఎస్‌ గురువారం ఓ ప్రకటనలో గుర్తుచేసింది. ఫ్రాన్స్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఆస్ట్రేలియాల్లో ప్రచురణకర్తలకు ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు గూగుల్‌ అంగీకరించిందని పేర్కొంది.


కాగా, వార్తా పరిశ్రమకు అండగా ఉండేందుకు వచ్చే మూడేళ్లలో రూ.7262 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఆస్ట్రేలియాలో సోషల్‌ మీడియా వేదికలు వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాలన్న చట్టంతో ఫేస్‌బుక్‌ ఇ బ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాము 2018 నుంచి వార్తలపై 4357 కోట్లు పెట్టుబడి పెట్టిన ట్లు తెలిపింది. ప్రచురణకర్తలకు వచ్చే మూడేళ్లలో 7262 కోట్లు చెల్లించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. 

Updated Date - 2021-02-26T09:34:59+05:30 IST