చైనా ఎల్లల వద్ద గేమ్ చేంజర్ US వెపన్స్

ABN , First Publish Date - 2021-10-31T20:18:03+05:30 IST

భారత సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా

చైనా ఎల్లల వద్ద గేమ్ చేంజర్ US వెపన్స్

న్యూఢిల్లీ : భారత సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారాయి. భారత్-చైనా సరిహద్దుల్లో అమెరికా తయారీ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది. దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను దీటుగా ఎదిరించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. సరిహద్దుల రక్షణలో ఇది గొప్ప మలుపు అని చెప్పవచ్చు. 


భారత్-చైనా మధ్య గత ఏడాది నుంచి ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికా తయారీ ఆయుధ వ్యవస్థను ఇటీవలే భారత్ సేకరించింది. ఈశాన్య భారత దేశంలోని తవంగ్ పీఠభూమి కేంద్రంగా ఈ ఆయుధ వ్యవస్థను మోహరించింది. ఈ పీఠభూమి భూటాన్, టిబెట్ పరిసరాల్లో ఉంది. ఇది తమ భూభాగమని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది భారత దేశ నియంత్రణలో ఉంది. ఈ భూభాగానికి చారిత్రక, రాజకీయ, సైనికపరమైన ప్రాధాన్యత ఉంది. 1959లో చైనా సైన్యం దాడి నుంచి తప్పించుకునేందుకు దలైలామా ఈ ప్రాంతం నుంచి భారత దేశానికి వచ్చారు. మూడేళ్ళ తర్వాత ఇరు దేశాలు ఈ ప్రాంతంలోనే యుద్ధం చేశాయి. 


ప్రస్తుతం తూర్పు టిబెట్ సరిహద్దుల్లో భారతీయ దళాలకు అమెరికా తయారీ చినూక్ హెలికాప్టర్లు, అల్ట్రా-లైట్ టోవ్‌డ్ హోవిట్జర్లు, రైఫిల్స్, మన దేశంలో తయారైన సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్స్, అత్యాధునిక నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయి. చైనా దూకుడుపై ఆందోళన పెరుగుతుండటంతో భారత్ అమెరికా నుంచి ఆయుధాలను సేకరించింది. 


భారత సైన్యం గత వారం కొందరు విలేకర్లను ఈ ప్రాంతానికి తీసుకెళ్ళి, ఈ ఆయుధ వ్యవస్థలను చూపించింది. దళాలను వేగంగా మోహరించేందుకు అనువైన రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. 


Updated Date - 2021-10-31T20:18:03+05:30 IST