ఇండో-చైనా చర్చలు త్వరలో!

ABN , First Publish Date - 2021-10-21T17:23:56+05:30 IST

భారత్-చైనా మిలిటరీ సీనియర్ కమాండర్ల స్థాయి 13వ

ఇండో-చైనా చర్చలు త్వరలో!

న్యూఢిల్లీ : భారత్-చైనా మిలిటరీ సీనియర్ కమాండర్ల స్థాయి 13వ రౌండ్ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు ఈ నెలలో మరోసారి సరిహద్దుల వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం కృషి చేసే యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) సమావేశమవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. భేటీ కోసం తేదీలను నిర్ణయించవలసి ఉంది. 


మిలిటరీ సీనియర్ కమాండర్ల స్థాయి 13వ రౌండ్ చర్చలు ఈ నెల 10న జరిగాయి. డబ్ల్యూఎంసీసీకి ఇరు దేశాల అడిషినల్ సెక్రటరీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. సైన్యాల ఉపసంహరణ, డెప్సాంగ్ బల్జ్, చార్డింగ్ నల్లా జంక్షన్ (సీఎన్‌జే), దెమ్‌చోక్‌లలో భారత సైన్యానికిగల గస్తీ హక్కుల పునరుద్ధరణ సమస్యల పరిష్కారం సంక్లిష్టంగా మారింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏమాత్రం సహకరించకుండా మొండిగా వ్యవహరిస్తుండటమే దీనికి కారణం. హాట్ స్ప్రింగ్స్ నుంచి వెనుకకు వెళ్ళేందుకు చైనా సైన్యం తిరస్కరించడం వల్లే 13వ రౌండ్ చర్చలు అసంతృప్తికరంగా ముగిసినట్లు తెలుస్తోంది. 2020 ఏప్రిల్‌నాటి ప్రదేశానికి వెళ్లడానికి చైనా సైన్యం తిరస్కరించినట్లు సమాచారం. 


ఈ సమస్య పరిష్కారం కోసం భారత సైన్యం కూడా ఆత్రుత ప్రదర్శించడం లేదు. చైనా సైన్యానికి దీటుగా భారత సైన్యం కూడా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మోహరించింది. గతంలో మాదిరిగా రాజీ పరిష్కారాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఎల్ఏసీపై చట్టబద్ధ హక్కుల కోసం పట్టుబడుతోంది. 3,488 కిలోమీటర్ల మేరకుగల ఎల్ఏసీ వెంబడి చైనా సైన్యం ఉల్లంఘనలకు పాల్పడితే దీటుగా తిప్పికొట్టేందుకు సెంట్రల్, ఈస్టర్న్ సెక్టర్లలో నిశితంగా గమనిస్తోంది. 


Updated Date - 2021-10-21T17:23:56+05:30 IST