అధికారంలోకి వస్తే.. సీఏఏ అమలు చేస్తాం

ABN , First Publish Date - 2021-03-22T06:59:18+05:30 IST

తాము అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ ప్రకటించింది.

అధికారంలోకి వస్తే.. సీఏఏ అమలు చేస్తాం

బెంగాల్‌లో అక్రమ వలసలను అడ్డుకుంటాం

ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33% కోటా

ఇంటికో కొలువు.. టెన్త్‌ దాకా బెంగాలీ 

మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం

అవినీతి నిరోధానికి సీఎంవోలో హెల్ప్‌లైన్‌

కొత్తగా మూడు ఎయిమ్స్‌ వైద్య శాలలు

బెంగాల్‌ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో


కోల్‌కతా, మార్చి 21: తాము అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ ప్రకటించింది. మొదటి కేబినెట్‌ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి, పొరుగు దేశాల నుంచి బెంగాల్‌కు అక్రమ వలసలను పూర్తిస్థాయిలో నిరోధిస్తామని పేర్కొంది.


పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ఆదివారం తన మేనిఫెస్టో ‘బంగారు బెంగాల్‌ సంకల్ప పత్రం-2021’ను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలిప్‌ ఘోష్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కైలాస్‌ విజయ్‌వర్గియా దీన్ని విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33ు రిజర్వేషన్‌ కేటాయిస్తామని ప్రకటించారు. వైద్య ఆరోగ్యం, ఉపాధి, విద్య, వ్యవసాయం రంగాలతోపాటు.. అవినీతిపై యుద్ధం వంటి అంశాలపై మేనిఫెస్టోను రూపొందించారు.
అందులోని ప్రధానాంశాలు..

 ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు.

మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం

 బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. దళిత, గిరిజన విద్యార్థినులకు ఆర్థికసాయం. ఎస్సీ, ఎస్టీలు తీసుకునే ప్రభుత్వ సర్టిఫికెట్లకు చార్జీల రద్దు

 అందుబాటులో ఇంజనీరింగ్‌, వైద్య విద్య. 10వ తరగతి వరకు అన్ని స్కూళ్లలో బెంగాలీ తప్పనిసరి. అధికార భాషగా బెంగాలీకి గుర్తింపు. అవినీతి నిరోధానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో హెల్ప్‌లైన్‌. శరణార్థులకు ఐదేళ్ల దాకా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం. తల్లులకు, వితంతు మహిళలకు నెలకు రూ.3 వేల పెన్షన్‌. ఉత్తర బెంగాల్‌, జంగల్‌ మహల్‌, సుందర్‌బన్‌ ప్రాంతాల్లో కొత్తగా మూడు ఎయిమ్స్‌ విద్యా సంస్థల ఏర్పాటు. కదంబినీ గంగూలి హెల్త్‌ ఫండ్‌కు రూ. 10వేల కోట్లు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు. రైతులకు పీఎం కిసాన్‌ ద్వారా ఏటా రూ. 18 వేల పెట్టుబడి సాయం. మత్స్యకారులకు రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయం. రైతుల ఉత్పత్తులకు మంచి ధర కోసం రూ. 5వేల కోట్ల కేటాయింపు. రూ. 20 వేల కోట్లతో రైతు భద్రత నిధి. ఠాగూర్‌ ప్రైజ్‌, సత్యజిత్‌ రే అంతర్జాతీయ అవార్డుల పరిచయం. ప్రతి బ్లాక్‌లో ‘నేతాజీ బోస్‌ బీపీవో’ల ఏర్పాటు. రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం. ఆస్పత్రులకు రూ.50 లక్షల దాకా వడ్డీలేని రుణాలు.


Updated Date - 2021-03-22T06:59:18+05:30 IST