తులసిపహాడ్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-14T09:08:54+05:30 IST

తులసిపహాడ్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల గుర్తింపు

తులసిపహాడ్‌ ఎన్‌కౌంటర్‌ మృతుల గుర్తింపు

మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ

వారి కోసం చాన్నాళ్లుగా గాలిస్తున్నాం: ఒడిసా డీజీపీ

మల్కన్‌గిరి (ఒడిసా), సీలేరు (విశాఖ జిల్లా), అక్టోబరు 13: ఆంధ్రా, ఒడిసా సరిహద్దు (ఏవోబీ)లోని మల్కన్‌గిరి జిల్లా తులసిపహాడ్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ముగ్గురు మావోయిస్టులను గుర్తించినట్టు ఒడిసా డీజీపీ అభయ్‌ కుమార్‌ ప్రకటించారు. వారి కోసం చాలాకాలంగా గాలిస్తున్నామని, వారికి అనేక నేరాలతో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. ఆ ముగ్గురిపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉందని చెప్పారు. బుధవారం మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో చనిపోయిన వారిని ముక్కా సోడి అలియాస్‌ అనిల్‌ అలియాస్‌ కిశోర్‌, చిన్నారావుతోపాటు మహిళా మావోయిస్టును సోనీగా గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఏవోబీ ఎస్‌జడ్‌సీ గుమ్మా ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్న ముక్కా సోడిపై రూ.5 లక్షల రివార్డు, మావోయిస్టు అగ్రనేత ఉదయ్‌ (సీసీఎం) రక్షణ బృందంలో ఏరియా కమిటీ మెంబర్‌గా ఉన్న సోనీపై రూ.4 లక్షల రివార్డు, పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు చిన్నారావుపై రూ.లక్ష రివార్డు ఉందన్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌, ఆరు మ్యాగజైన్లు, 59 బుల్లెట్లు, ఐఈడీ పేలుడు పదార్థాలు, వాకీటాకీలు, డిటోనేటర్లు, కిట్‌ బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రి లభించాయన్నారు.

Updated Date - 2021-10-14T09:08:54+05:30 IST