కుప్పకూలిన మిగ్-21 బైసన్ విమానం... వాయుసేన పైలట్ సురక్షితం...

ABN , First Publish Date - 2021-08-26T01:35:30+05:30 IST

భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్

కుప్పకూలిన మిగ్-21 బైసన్ విమానం... వాయుసేన పైలట్ సురక్షితం...

న్యూఢిల్లీ : భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం రాజస్థాన్‌లోని బామర్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటన నుంచి ఆ విమానం పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఐఏఎఫ్ ఓ ట్వీట్‌ ద్వారా ఈ వివరాలను తెలిపింది. 


ఐఏఎఫ్ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం సుమారు 5.30 గంటల ప్రాంతంలో శిక్షణ ఇవ్వడం కోసం ఈ విమానం బయల్దేరింది. బయల్దేరిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడటంతో కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయటకొచ్చారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. 


రాజస్థాన్‌లోని బామర్ పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, వాయు సేన విమానం బుధవారం సాయంత్రం సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భుర్తియ గ్రామం సమీపంలో కూలిపోయింది. ఈ సంఘటనలో సామాన్యులకు ప్రాణ నష్టం జరగలేదు. ఈ విమానం పైలట్ నేలపై పడిపోయి ఉన్నట్లు ఓ ఫొటోలో కనిపిస్తోంది, అయితే సురక్షితంగానే ఉన్నారు. ఈ సంఘటన స్థలం వద్ద గ్రామస్థులు గుమిగూడారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వచ్చిన ఫొటోలనుబట్టి ఈ విమానం నుంచి పొగ వస్తోందని, కొన్ని గుడిసెలు కాలిపోయాయని తెలిసింది. 


ఈ ఏడాది మిగ్-21 బైసన్ విమానాలకు సంబంధించిన ప్రమాదాలు నాలుగు నమోదుకావడం గమనార్హం. జనవరి 5న సూరత్ గఢ్‌లో జరిగిన ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. మార్చి 17న మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని మోగాలో మే 20న జరిగిన ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-08-26T01:35:30+05:30 IST