నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను: బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-22T13:55:27+05:30 IST

కొద్ది రోజుల క్రితం గుజరాత్ స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా కోవిడ్‌కు లోనయ్యారు.

నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను: బీజేపీ ఎమ్మెల్యే

అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కరోనా వైరస్ సోకదంటూ వ్యాఖ్యానించిన ఆ పార్టీ నేత, రాజ్‌కోట్ ఎమ్మెల్యే గోవింద్ పటేల్, తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కష్టపడి పని చేసే వారికి కరోనా రాదనే అర్థంలో చెప్పే క్రమంలో బీజేపీ కార్యకర్తలని కూడా సంబోధించానని ఆయన అన్నారు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ తనవైపు నుంచి తప్పు జరిగిందని, ఇందుకుగాను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు గోవింద్ పటేల్ తెలిపారు.

ఎన్నికల ర్యాలీల్లో రాజకీయ నేతలు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆదివారం నాడు ఎమ్మెల్యే గోవింద్ పటేల్‌ను విలేకర్లు ప్రశ్నించగా, బీజేపీ కార్యకర్తలకు కోవిడ్‌కు లోనయ్యే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పని చేస్తుంటారని, అందుకే వారికి కోవిడ్ సోకదని అన్నారు. ‘‘ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి కోవిడ్ రాదు. బీజేపీ కార్యకర్తలు ఎంతగానో కష్టపడుతుంటారు. అందుకే బీజేపీ కార్యకర్తలకు కోవిడ్ రాదు’’ అని గోవింద్ పటేల్ అన్నారు.

కొద్ది రోజుల క్రితం గుజరాత్ స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా కోవిడ్‌కు లోనయ్యారు.

Updated Date - 2021-03-22T13:55:27+05:30 IST