సాగు చట్టాలపై మళ్లీ మాట మార్చిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2021-12-26T16:33:29+05:30 IST

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు..

సాగు చట్టాలపై మళ్లీ మాట మార్చిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మళ్లీ మాట మార్చారు. శనివారం కేంద్ర ప్రభుత్వం మళ్లీ తీసుకు వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపడంతో తాను అలా అనలేదని వివరణ ఇచ్చుకొచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తోమర్ వ్యాఖ్యలపై ట్రిగ్గర్ ఎక్కుపెట్టి విమర్శలు గుప్పించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగు చట్టాల్ని వెనక్కి తీసుకున్నారని, ఈ ఎన్నికలు ముగియగానే మళ్లీ సాగు చట్టాల్ని తీసుకువస్తారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. నాగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఆజ్యం పోశాయి.


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ.. రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామని, భవిష్యత్తులో మళ్లీ ముందుకు వెళ్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తెస్తామని ప్రకటించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.


అయితే తన మాటలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని తోమర్ మండిపడ్డారు. ‘‘వ్యవసాయ చట్టాలను మళ్లీ వెనక్కి తీసుకువస్తామని నేను చెప్పలేదు. రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం మంచి చట్టాలు చేసింది. కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గాం. అయితే రైతుల శ్రేయస్సు గురించి మా ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక అని వ్యాఖ్యానించాను. అంతే కానీ సాగు చట్టాల్ని మళ్లీ తీసుకువస్తామని చెప్పలేదు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-26T16:33:29+05:30 IST