‘ఐడా’ హరికేన్‌ బీభత్సం

ABN , First Publish Date - 2021-09-03T07:47:36+05:30 IST

అమెరికా ప్రజలు ‘ఐడా’ హరికేన్‌తో బెంబేలెత్తిపోతున్నారు. ‘ఐడా’ బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోకముందే ఆ పెను తుఫాను ప్రభావం న్యూయార్క్‌ సిటీ, న్యూ జెర్సీపై పడడం గమనార్హం...

‘ఐడా’ హరికేన్‌ బీభత్సం

  • 19 మంది మృతి.. న్యూయార్క్‌, న్యూ జెర్సీలో అత్యయిక స్థితి 

న్యూయార్క్‌, సెప్టెంబరు 2: అమెరికా ప్రజలు ‘ఐడా’ హరికేన్‌తో బెంబేలెత్తిపోతున్నారు. ‘ఐడా’ బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోకముందే ఆ పెను తుఫాను ప్రభావం న్యూయార్క్‌ సిటీ, న్యూ జెర్సీపై పడడం గమనార్హం. భారీ వరదలతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్‌లో ‘ఆకస్మిక వరదల అత్యయిక స్థితి’ని అమెరికా ప్రకటించింది. సబ్‌వే స్టేషన్‌లు, ట్రాక్‌లపై వరద నీరు భారీగా నిలవడంతో రవాణా స్తంభించింది. న్యూయార్‌లోని సెంట్ర ల్‌ పార్క్‌ వద్ద బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ సేవల కార్యాలయం తెలిపింది. న్యూజెర్సీలోని కర్నీలో ‘యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌’ భవన పైకప్పు కూలింది. న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలూ బీభత్సం సృష్టించాయి. న్యూజెర్సీలోని 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యయిక స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావచ్చని చెప్పింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ భారీ వరదలు సంభవించాయి. లూసియానా రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. స్పెయిన్‌లోని అల్కనార్‌లోనూ గురువారం భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. అనేక కార్లు సముద్రంలోని కొట్టుకుపోయాయి. కార్యాలయాలు, ఇళ్లలోకి భారీగా బురద, వరద నీళ్లు చేరాయి. 

Updated Date - 2021-09-03T07:47:36+05:30 IST