12 మందిపై వేటు

ABN , First Publish Date - 2021-07-08T07:33:00+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గానికి సమూల ప్రక్షాళన చేశారు. యువత, కొత్తవారు, విద్యాధికులతో కొత్త రూపురేఖలు తీసుకొచ్చారు.

12 మందిపై వేటు

  • కేంద్ర కేబినెట్‌ సమూల ప్రక్షాళన.. 36 మంది కొత్త మంత్రుల ప్రమాణం
  • అనురాగ్‌, రూపాలా, ఆర్‌కే సింగ్‌, రిజిజు, మాండవీయ, పురికి కేబినెట్‌ హోదా
  • గవర్నర్‌గా వెళ్లిన గహ్లోత్‌ సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన
  • రవిశంకర్‌, జావడేకర్‌, హర్షవర్ధన్‌, పోఖ్రియాల్‌, సదానంద గౌడపై వేటు
  • మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ, అప్నాదళ్‌కు తలో పదవి
  • కొత్తగా 15 మందికి చోటు
  • 28 మంది సహాయ మంత్రులు
  • 77కి చేరిన మంత్రివర్గం
  • వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్‌కు పెద్దపీట
  • మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్‌కూ..
  • ప్రాతినిధ్యంలేని ఆంధ్ర, కేరళ, పంజాబ్‌


ఎట్టకేలకు మోదీ 2.0 కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగింది. పనితీరు కొలమానంగా కిషన్‌రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌ వంటివారికి ప్రమోషన్‌ ఇచ్చిన ప్రధాని.. అనూహ్యంగా సీనియర్‌ మంత్రులైన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, డీవీ సదానంద గౌడ, సంతో్‌షకుమార్‌ గాంగ్వార్‌కు ఉద్వాసన పలికారు. కీలకమైన.. విద్య, వైద్యం, న్యాయం, పర్యావరణ శాఖల మంత్రులు ఇందులో ఉండడం గమనార్హం. కర్ణాటక గవర్నర్‌గా వెళ్లిన థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కూడా కలుపుకొంటే, మొత్తం 12 మందిని సాగనంపి.. 36 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. యువత, విద్యాధికులు, ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మహిళలకు పెద్దపీట వేశారు. వయసు, అనుభవంతో పాటు నైపుణ్యాన్ని, చురుకుతనాన్ని, రాజకీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని విస్తరణ చేపట్టారు.


న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గానికి సమూల ప్రక్షాళన చేశారు. యువత, కొత్తవారు, విద్యాధికులతో కొత్త రూపురేఖలు తీసుకొచ్చారు. 2019లో రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన ఆయన.. బుధవారం తొలిసారి తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. గవర్నర్‌గా పంపిన గెహ్లోత్‌తో సహా.. 12 మంది మంత్రులను తొలగించారు. మహారాష్ట్ర, అసోం మాజీ సీఎంలు నారాయణ్‌ రాణే, శర్వానంద్‌ సొనోవాల్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా సహా 43 మందిని కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. సహాయ మంత్రులుగా ఉన్న జి.కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆర్‌కే సింగ్‌, హర్‌దీ్‌పసింగ్‌ పురి, మన్‌సుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజులకు కేబినెట్‌ హోదా లభించింది. ఈ ఏడుగురితోపాటు కొత్తగా 36 మంది మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో పదవీ ప్రమాణం చేయించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో.. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు అధిక ప్రాఽధాన్యం లభించింది. యూపీ నుంచి 9 మంది, గుజరాత్‌ నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. 


మహారాష్ట్ర, బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి తలో నలుగురికి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌, సిక్కింలదీ అదే పరిస్థితి. మిత్రపక్షాలైన జనతాదళ్‌(యు), ఎల్‌జేపీ, అప్నాదళ్‌లకు చెరోస్థానం లభించింది. దళ్‌(యు) అధ్యక్షుడు రామచంద్రప్రసాద్‌ సింగ్‌, ఎల్‌జేపీ చీలికవర్గం నేత, దివంగత రామ్‌విలాస్‌ పాసవాన్‌ తమ్ముడు పశుపతికుమార్‌ పరస్‌, యూపీలో అప్నాదళ్‌ నాయకురాలు అనుప్రియ పటేల్‌కు పదవులు దక్కాయి. కేబినెట్‌లో మహిళల సంఖ్య 11కి చేరుకుంది. కొత్త మంత్రుల్లో రాణే(69) పెద్ద వయస్కుడు కాగా.. బెంగాల్‌ కూచ్‌బిహార్‌ ఎంపీ అయిన నిశిత్‌ ప్రామాణిక్‌(35) అత్యంత పిన్న వయస్కుడు. కొత్త మంత్రుల్లో 15 మందికి కేబినెట్‌ హోదా దక్కగా.. 28 మంది సహాయ మం త్రులుగా ప్రమాణం చేశారు. కొత్త కేబినెట్‌ భేటీ గురువారం జరగనుంది.


ఆరుగురు సీనియర్‌ మంత్రులకు ఉద్వాసన

మోదీ తొలగించిన 12 మందిలో ఆరుగురు సీనియర్‌ మంత్రులు ఉండ డం విశేషం. రవిశంకర్‌ ప్రసాద్‌(ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, న్యాయ శాఖలు), ప్రకాశ్‌ జావడేకర్‌(పర్యావరణం, అడవులు, సమాచార ప్రసార శాఖలు), హర్షవర్ధన్‌ (ఆరోగ్య, కుటుంబ సంక్షేమం), రమేశ్‌ పోఖ్రియాల్‌(విద్యాశాఖ),  సదానంద గౌడ(ఎరువులు, రసాయనాలు)తో పాటు సంతో్‌షకుమార్‌ గాంగ్వార్‌ (కార్మి క శాఖ)కు ఉద్వాసన పలకడం సంచలనం కలిగించింది. సహాయ మంత్రులైన బాబుల్‌ సుప్రియో(అటవీ, పర్యావరణం), సంజయ్‌ దోత్రే(విద్యాశాఖ), రత్తన్‌లాల్‌ కటారియా(జలశక్తి), దేబశ్రీ చౌధరి(మహిళా శిశు సంక్షేమం), ప్రతా్‌పచంద్ర సారంగి(పశుసంవర్ధక, మత్స్య శాఖలు) రాజీనామా చేశారు. ఇక, కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ మంగళవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజా విస్తరణతో మోదీ కేబినెట్‌ సభ్యుల సంఖ్య 77కి పెరిగింది. మంత్రివర్గం సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 14 మంది 50 ఏళ్లలోపు వారే!

Updated Date - 2021-07-08T07:33:00+05:30 IST