దైవాశ్వం అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన
ABN , First Publish Date - 2021-05-24T20:16:42+05:30 IST
కర్ణాటకలోని బెళగవి జిలాల్లో ఒక గుర్రం అంత్యక్రియల్లో కరోనా నిబంధనలను..

బెంగళూరు: కర్ణాటకలోని బెళగవి జిలాల్లో ఒక గుర్రం అంత్యక్రియల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘించి వందలాది పాల్గొనడం సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఘటన చోటుచేసుకున్న మరడిమఠ్ కుగ్రామ్రాన్ని సీల్ చేసింది. ఈ గ్రామంలో సుమారు 400 ఇళ్లు ఉన్నాయి. కరోనా నిబంధనల ఉల్లంఘన ఘటనపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
సంఘటన వివరాల ప్రకారం, మరిడిమఠ్ గ్రామంలోని కడసిద్ధేశ్వర్ ఆలయంలో ఈ అశ్వం ఉంటుంది. స్వామివారి సేవలకు ఈ అశ్వాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే దీనిని అందరూ ఆప్యాయంగా 'దైవాశ్వం' అని పిలుస్తుంటారు. ఈ ప్రపంచాన్ని కోవిడ్ నుంచి విముక్తి కలిగించాలని శ్రీ కడసిద్ధేశ్వర స్వామివారికి ప్రార్థనలు చేసి రెండ్రోజుల క్రితం అశ్వాన్ని ఆశ్రమం నుంచి విడిచిపెట్టారు. అది నిరాఘాటంగా రెండ్రోజులు గ్రామం చుట్టూ కలియతిరిగి, శుక్రవారం రాత్రి కన్నుమూసింది. దైవాశ్వానికి ఆశ్రమ సాధువు శ్రీ పాదేశ్వర్ స్వామి శనివారంనాడు అంతక్రియలు నిర్వహించారు. దైవాశ్వాన్ని కడసారి చూసేందుకు, నివాళులర్పించేందుకు పెద్దఎత్తున గ్రామస్థులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడం, విస్తృతంగా షేర్ కావడంతో కోవిడ్ ఆంక్షల ఉల్లంఘనపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.