బైడెన్-కమల ప్రమాణానికి భారీ భద్రత
ABN , First Publish Date - 2021-01-18T07:37:17+05:30 IST
బైడెన్- కమలా హారిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 20వ తేదీన అమెరికాలో భారీ భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ ఓ భద్రతా
వాషింగ్టన్, జనవరి 17: బైడెన్- కమలా హారిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 20వ తేదీన అమెరికాలో భారీ భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ ఓ భద్రతా వలయంలా ఉంది. 25వేల మంది సాయుధ నేషనల్ గార్డ్స్ ఇప్పటికే పహరా కాస్తున్నారు. శ్వేత సౌధంతో పాటు కేపిటల్ భవనానికి దారి తీసే అన్ని మార్గాలనూ చాలా దూరం నుంచే మూసేశారు. సాయుధుడైన ఓ వ్యక్తి ఓ అనధికార ఎంట్రీ పాస్‌తో వస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద ఓ తుపాకీ, 500 రౌండ్ల మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి. దీంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఆ రోజున హింసా విధ్వంసాలకు అనేక రాడికల్ గ్రూపులు కుట్రపన్నాయని ఇప్పటికే ఎఫ్‌బీఐ హెచ్చరించింది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్ ట్విటర్ ఖాతా ఏ ఫాలోయర్లూ లేకుండా సున్నాతో మొదలవుతుంది. ఇన్నాళ్లూ అఽమెరికా అధ్యక్షుడి(పోటస్) ఖాతా తదుపరి అధ్యక్షుడికి ఆటోమేటిక్‌గా కొనసాగేది. అయితే ట్రంప్ హయాం వివాదాస్పదం కావడం, ఆయన ఖాతాను ట్విటర్ నిలిపేయడంతో బైడెన్‌కు ట్రంప్ జమానాలోని మద్దతుదారులెవరి ఫాలోయింగూ లభించదు. కాగా జో బైడెన్ వ్యక్తిగత ఖాతాకు 24 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాక ఆయన ప్రెస్ఎలక్ట్బైడెన్ పేరిట ఓ ఖాతా తెరిచారు. ఇపుడు ఇదే అకౌంటు 20వ తేదీ 12 గంటల నుంచి తన అధికారిక అకౌంట్‌గా (పోట్సగా) మారుతుందని బైడెన్ చెప్పారు.