11 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్, గాజాలకు భారీ నష్టం

ABN , First Publish Date - 2021-05-21T21:49:07+05:30 IST

ఇజ్రాయెల్-గాజా మధ్య కాల్పుల విరమణ శుక్రవారం

11 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్, గాజాలకు భారీ నష్టం

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-గాజా మధ్య కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. 11 రోజులపాటు జరిగిన యుద్దంలో ఇరు వర్గాలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. గాజా స్ట్రిప్‌లోని శానిటేషన్ ఫెసిలిటీస్, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారీగా దెబ్బతినగా, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో పడింది. 


తాగునీరు సైతం...

గాజా హౌసింగ్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, 16,800 హౌసింగ్ యూనిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో దాదాపు 1,800 వరకు నివాస యోగ్యం కాకుండాపోయాయి, సుమారు 1,000 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిశ్రమలకు జరిగిన నష్టం 40 మిలియన్ డాలర్లు, ఎనర్జీ సెక్టర్‌కు 22 మిలియన్ డాలర్లు నష్టం జరిగినట్లు హమస్ మీడియా పేర్కొంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దాదాపు 27 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది. ప్రజలకు తాగునీరు అందుబాటులో లేదని ఐక్య రాజ్య సమితి సహాయక బృందాలు తెలిపాయి. 


ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పింది. ఆరోగ్య సంక్షోభం నుంచి కోలుకోకుండా ఈ యుద్ధం అడ్డుకుంటుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇజ్రాయెల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మే 13న తెలిపిన వివరాల ప్రకారం మే 11 నుంచి 13 వరకు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం 166 మిలియన్ డాలర్లు. గాజా ప్రయోగించిన రాకెట్ల వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్స్ మినిస్ట్రీ, మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపాయి. 


ఇంధన ట్యాంకర్లను ఇతర పోర్టులకు తరలించవలసి రావడంతో ఇంధనం బట్వాడా ఆలస్యమైందని నౌకా, వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎనర్జీ కంపెనీపై రాకెట్ దాడి జరిగింది. అంతర్జాతీయ వైమానిక సేవలను కూడా నిలిపేయాల్సి వచ్చింది. 


అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు 

గాజా స్ట్రిప్‌ను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమస్ పరిపాలిస్తోంది. ఇజ్రాయెలీ పోలీసులు జెరూసలెంలోని అల్ అక్సా మసీదును ఖాళీ చేయాలని హమస్ హెచ్చరించింది. కానీ ఇజ్రాయెల్ అందుకు అంగీకరించకపోవడంతో హమస్ రాకెట్లను ప్రయోగించింది. హమస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జీహాద్ దాదాపు 4 వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించాయి. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా దాడులు నిర్వహించింది. 


Updated Date - 2021-05-21T21:49:07+05:30 IST