కొవిడ్ రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

ABN , First Publish Date - 2021-05-25T00:36:07+05:30 IST

కరోనా బారినపడి కోలుకుంటున్న రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న కేసులు ఇటీవల బాగా పెరిగాయి. తాజాగా, భారత వైద్య

కొవిడ్ రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

న్యూఢిల్లీ: కరోనా బారినపడి కోలుకుంటున్న రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న కేసులు ఇటీవల బాగా పెరిగాయి. తాజాగా, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. కరోనాతో ఆసుపత్రి పాలవుతున్న రోగుల్లో 3.6 శాతం మంది రోగులు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్టు తేలింది.


ఈ ఇన్ఫెక్షన్లతో చనిపోతున్న వారి సంఖ్య 56.7 శాతానికి పెరిగింది. డేటా సేకరించిన పది ఆసుపత్రుల్లో చేరిన రోగులలో ఇది 10.6 శాతంగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. అయితే, ఒక ఆసుపత్రిలో మాత్రం సెకండరీ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో మరణాలు 78.9 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.


తాము గుర్తించిన చాలా వరకు సెకండరీ ఇన్ఫెక్షన్లలో 78 శాతం ఆసుపత్రుల్లో సంక్రమించినవేనని అధ్యయనకారులు తెలిపారు. ఆసుపత్రుల్లో చేరిన రెండు రోజుల తర్వాతే ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన లక్షణాలు ప్రారంభమయ్యాయని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కామిని వాలియా పేర్కొన్నారు. తాము పరీక్షించిన చాలా నమూనాల్లో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఉందని, అది ఆసుపత్రుల్లో సంక్రమించినదేనని తెలిపారు. కరోనా కారణంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీలు అటకెక్కిపోవడమే ఇందుకు కారణమన్నారు. 


సంక్రమణకు కారణమయ్యే అత్యంత సాధారణ వ్యాధి కారకాలు క్లెబ్సియెల్లా న్యూమోనియా, ఎసింటోబాక్టర్ బౌమన్నీ అని డాక్టర్ కామిని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం సాధారణంగా ఇ-కొలి అనేది సాధారణ వ్యాధికారకం. రెండు అంటు వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టమైన పని అని ఆమె తెలిపారు. ఎందుకంటే అవి ఆ సమయంలో రెసిస్టెన్స్ జీన్స్‌ను సంపాదించుకుంటాయన్నారు. దీంతో కొవిడ్ అనంతర చికిత్స కష్టమవుతుందని వివరించారు. కాబట్టి ఆసుపత్రులు తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు పాటించాలని డాక్టర్ కామిని సూచించారు. 

Updated Date - 2021-05-25T00:36:07+05:30 IST