గగనంలో ఘోరం

ABN , First Publish Date - 2021-12-09T08:14:50+05:30 IST

ప్రతికూల వాతావరణం లేదు! పొగమంచు మినహా అంతా ప్రశాంతంగా ఉంది! అదేమీ సాదాసీదా హెలికాప్టర్‌ కాదు! డబుల్‌ ఇంజిన్‌తో నడిచే అత్యంత శక్తిమంతమైన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌! అందులో..

గగనంలో ఘోరం

  • మహా దళాధిపతిని బలి తీసుకున్న ప్రమాదం
  • రావత్‌ దంపతులతో సహా 13 మంది దుర్మరణం
  • తమిళనాడులో కూలిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌
  • ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి సూలూరుకు రావత్‌ 
  • అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ కాలేజీకి..
  • పొగ మంచుతో తక్కువ ఎత్తులో ఎగిరిన చాపర్‌
  • 5 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరతారనగా ఘోరం
  • హెలికాప్టర్‌ పనస చెట్టును ఢీకొట్టిందనే అనుమానం
  • నేలకు తగిలి మంటలు.. ముక్కలైన లోహ విహంగం
  • మృత్యుంజయుడుగా గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ 
  • తీవ్ర గాయాలతో సైనిక ఆస్పత్రిలో చికిత్స
  • మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ్‌



అమరులు వీరే..

1) జనరల్‌ బిపిన్‌ రావత్‌

2) మధులికా రావత్‌ 

3)బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ సిద్దర్‌

4) లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌హర్జీందర్‌ సింగ్‌

5) నాయక్‌ గురుసేవక్‌సింగ్‌

6) నాయక్‌ జితేంద్ర కుమార్‌

7) లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌

8) లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ

9) హవల్దార్‌ సత్పాల్‌

10) వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్‌

11) స్క్వాడ్రన్‌ లీడర్‌ కె.సింగ్‌

12) జేడబ్ల్యూవో ప్రదీప్‌

13) జేడబ్ల్యూవో దాస్‌


చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల వాతావరణం లేదు! పొగమంచు మినహా అంతా ప్రశాంతంగా ఉంది! అదేమీ సాదాసీదా హెలికాప్టర్‌ కాదు! డబుల్‌ ఇంజిన్‌తో నడిచే అత్యంత శక్తిమంతమైన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌! అందులో... ప్రయాణిస్తున్నది సాధారణ వ్యక్తి కూడా కాదు! త్రివిధ దళాల సారథి... చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌! ఆయన ప్రయాణిస్తున్న వైమానిక దళానికి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ కుప్పకూలింది. దేశ రక్షణ చరిత్రలోనే అతి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఏకంగా... దేశ రక్షణ దళాల సారథినే బలి తీసుకుంది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌, రక్షణ సిబ్బంది సహా మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాప్టర్‌ ముక్కలుముక్కలై పోయింది. ఈ ఘోర దుర్ఘటనలో రావత్‌ దంపతులతోపాటు మొత్తం 13 మంది మరణించారు. ఒకే ఒక్కరు.... గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ మాత్రం తీవ్రమైన కాలిన గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఊటీ సమీపంలోని కున్నూరు వద్ద ఈ ఘోరం జరిగింది. రావత్‌ జీవించే  ఉన్నారని... ఆయనకు చికిత్స అందుతోందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ... జనరల్‌ రావత్‌ ఇక లేరని సాయంత్రం 6.15 గంటల సమయంలో వైమానిక దళం అధికారికంగా ప్రకటించింది. దీంతో... భారతదేశ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ సాహసోపేత రక్షణ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసింది. దేశ రక్షణ  చరిత్రలోనే ఇదో దుర్దినంలా మిగిలిపోయింది.


వెల్లింగ్టన్‌లో ప్రసంగించేందుకు...

ఊటీకి సమీపంలోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ (డీఎ్‌సఎ్‌ససీ)లో బుధవారం సాయంత్రం జరిగే సదస్సులో బిపిన్‌ రావత్‌ ప్రత్యేక ఉపన్యాసం చేయాల్సి ఉంది. దీనికోసం ఉదయం 9 గంటలకు తన సతీమణి మధులికతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరారు. వీరితోపాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. మొత్తం తొమ్మిది మందితో కూడిన విమానం 11.15 గంటలకు తమిళనాడులోని సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈ బృందానికి స్థానిక సైనికాధికారులు స్వాగతం పలికారు.  ఢిల్లీ నుంచి వచ్చిన 9 మందితోపాటు మరో ఐదుగురు... మొత్తం 14 మందితో 11.45 గంటలకు హెలికాప్టర్‌ వెల్లింగ్టన్‌కు బయలు దేరింది. హెలికాప్టర్‌ గ్రూప్‌ కెప్టెన్‌... వరుణ్‌ సింగ్‌! అందులో... రావత్‌ దంపతులతోపాటు డిఫెన్స్‌ అసిస్టెంట్‌, సెక్యూరిటీ కమెండోలు, ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌, ఇతర సిబ్బంది ఉన్నారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌ మధ్య దూరం 110 కిలోమీటర్లు. నీలగిరి పర్వతాల మీదుగా ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాతావరణం హెలికాప్టర్‌ ప్రయాణానికి అనుకూలంగానే ఉంది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో... తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది. మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానమైన వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌ వచ్చేస్తుంది. అంతలోనే... అనుకోని ఆపద ఎదురైంది. 


అంత దృఢమైన హెలికాప్టర్‌ చిగురుటాకులా వణుకుతూ, వేగంగా కిందికి పడిపోవడం మొదలైంది. కొద్ది క్షణాల్లోనే... దట్టమైన అడవిలో పచ్చటి చెట్ల మధ్య  హెలికాప్టర్‌ నేలను తాకి, ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. జనావాసానికి అత్యంత సమీపంలోనే హెలికాప్టర్‌ కుప్పకూలింది. స్థానికులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. బిందెలు, బకెట్లతో నీళ్లు చల్లి మంటలు ఆర్పేందుకు శ్రమించారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో హెలికాప్టర్‌ను మాత్రం సమీపించలేకపోయారు. తమ కళ్ల ముందే హెలికాప్టర్‌లో నుంచి రెండు మృతదేహాలు కిందికి పడిపోయాయని పెరుమాల్‌ అనే స్థానికుడు తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో రావత్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరైన, చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ్‌ కూడా ఉన్నారు. 80 శాతం కాలిన గాయాలతో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురిని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హూటాహుటిన వెల్లింగ్టన్‌ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అందులో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ మాత్రమే ప్రాణాలతో పోరాడుతున్నారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన  వారంతా మరణించినట్లు నీలగిరి జిల్లా కలెక్టర్‌ అమృత్‌ ధ్రూవీకరించారు. 


అసలేం జరిగింది?

ఎంఐ-17 రకం హెలికాప్టర్లకు ‘సురక్షితమైనవి’గా పేరుంది. అలాంటి హెలికాప్టర్‌... అదీ సీడీఎస్‌ ప్రయాణిస్తుండగా కుప్పకూలిపోవడాన్ని రక్షణ శాఖ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. నీలగిరి జిల్లాలో ఈ సమయంలో విపరీతమైన మంచు కురవడం సహజమే. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్‌ను... అటూ ఇటూ కొండల మధ్య ఒక  లోయలో... తక్కువ ఎత్తులో నడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనప్పటికీ పొగమంచు వీడకపోవడంతో... పైలట్‌ సరిగ్గా ఎత్తును అంచనా వేయలేకపోయారని, ఇదే క్రమంలో హెలికాప్టర్‌ ఒక చెట్టును తగిలి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాగా ఎత్తైన పనస చెట్టును హెలికాప్టర్‌ ఢీకొట్టిందని స్థానికులు కూడా చెబుతున్నారు. నిజానికి... ఇలాంటి ప్రమాద సమయాల్లోనూ హెలికాప్టర్‌ ఇంధన ట్యాంకు పేలకుండా రక్షణ కవచం ఉంటుంది. అయినప్పటికీ... హెలికాప్టర్‌ కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగాయి. తక్కువ ఎత్తు నుంచి పడిపోయినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం జరిగేది కాదని... మంటలు చెలరేగడంతో తీరని నష్టం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 


మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష?

మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఘటనాస్థలిలో ఓ మహిళ మృతదేహం లభించింది. అది... రావత్‌ సతీమణి మధులికా రావత్‌దే అనే నిర్ధారణకు వచ్చారు. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో గురువారం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే మృతదేహాలను ఢిల్లీకి తరలించనున్నట్లు తెలిసింది. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన మేట్టుపాళయం-కున్నూర్‌ రహదారిని సైనికులు ఆధీనంలోకి తీసుకున్నారు. హెలికాప్టర్‌లోని బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైతే ప్రమాదానికిగల కారణాలు తెలిసే అవకాశముండడంతో ఆ మార్గంలో సైనికులను మోహరించారు.


రావత్‌... తిరిగి వస్తారని!

హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత బిపిన్‌ రావత్‌ క్షేమ సమాచారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే... సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి మొత్తం రెండు హెలికాప్టర్లు బయలుదేరాయి. ఒకటి ముందుగానే గమ్యస్థానానికి చేరుకుంది. రెండోది నంజప్ప సత్రం వద్ద కుప్పకూలింది. ఆ తర్వాత 15 నిమిషాలకు ప్రమాద వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. బిపిన్‌ రావత్‌ ఏ హెలికాప్టర్‌లో ఉన్నారో అప్పటికి స్పష్టత లేదు. దీంతో... ఆయన ప్రమాదం నుంచి బయటపడి ఉంటారనే ఆశ కనిపించింది. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో మృతుల్లో ఆయన ఉన్నారో లేదో నిర్ధారించుకునేందుకు రక్షణ శాఖకు సమయం పట్టింది. చివరికి ఆ హెలికాప్టర్‌లో ఎక్కినవారి సంఖ్య, ఘటనా స్థలిలో లభించిన మృతదేహాల సంఖ్య సరిపోవడంతో రావత్‌ కూడా మరణించారని మధ్యాహ్నం 3 గంటలకు నిర్ధారణకు వచ్చారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బిపిన్‌ రావత్‌ దంపతుల మృతిని వైమానిక దళం ప్రకటించింది. రావత్‌ దంపతుల అంత్యక్రియలను శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్‌లో నిర్వహించనున్నారు.


మోదీతో రక్షణ మంత్రి భేటీ

స్వయంగా సీడీఎ్‌సనే పొట్టన పెట్టుకున్న ఈ ఘోర దుర్ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధాని మోదీని కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఆ తర్వాత... ఢిల్లీలోని బిపిన్‌ రావత్‌ నివాసానికి వెళ్లారు. ఆయన కుమార్తెతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ దుర్ఘటనపై రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు. ఈ ప్రమాదంపై విచారణకు వైమానిక దళం ‘కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ’ని నియమించింది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 


బీభత్స  దృశ్యం...

పశ్చిమ కనుమలు... నీలగిరి అడవులు... తేయాకు తోటలు... దట్టమైన అడవులు! అక్కడున్న ప్రశాంత వాతావరణం బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంతో చెల్లాచెదురైంది. జనరల్‌ రావత్‌ దంపతులు, ఇతర సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూనూరు దగ్గర కాట్టేరి పంచాయతీ నంజప్ప సత్రం వద్ద కుప్పకూలింది. ఇది 50 కుటుంబాలు నివసిస్తున్న కుగ్రామం. ఈ ఊరికి అత్యంత సమీపంలో... ఒక ఇంటిని తాకుతూ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడ ప్రాణనష్టం తప్పింది. హెలికాప్టర్‌ నేరుగా గ్రామంలోని ఇళ్లపై పడినా భారీగా ప్రాణనష్టం జరిగేది. ప్రమాదం జరిగిన చోటినుంచి వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌ 16 కిలోమీటర్ల దూరం. హెలికాప్టర్‌ బయలుదేరిన సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోరం జరిగింది. జనావాసాలకు సమీపంలోనే హెలికాప్టర్‌ కుప్పకూలడంతో క్షణాల్లోనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా వాళ్లు చెట్లు తగలబడిపోతున్నాయని అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూసేసరికి ముక్కలైపోయిన హెలికాప్టర్‌ కనిపించింది. పాక్షికంగా తగలబడి ఆలివ్‌ గ్రీన్‌ దుస్తుల్లో ఉన్న మృతదేహాలను చూడగానే... ప్రమాదానికి గురైంది సైనిక సిబ్బంది అని గ్రహించారు.


హెలికాప్టర్‌లోని ఇంధనం కారణంగా గంటన్నరపాటు మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మంటలు, పొగ, కూలిన, కాలుతున్న చెట్లతో ఆ ప్రాంతం బీభత్సంగా కనిపించింది. సంఘటన స్థలానికి నేరుగా వాహనాలు చేరుకునే అవకాశం లేదు. తేయాకు తోటల మధ్యలోంచి... మెట్ల దారిలో నడిచి రావాల్సిందే.  అంతా కొండప్రాంతం, దట్టమైన అడవే. దీంతో... సహాయ చర్యల్లో జాప్యం జరిగింది. నీలగిరి జిల్లా అటవీశాఖ సత్వర స్పందనతో సహాయక చర్యలు ఆమాత్రమైనా అందినట్లు చెబుతున్నారు. కోయంబత్తూరు, మేట్టుపాలయం, కున్నూర్‌ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు, ఆరోగ్యశాఖ సిబ్బంది వందలాదిగా తరలివచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


గాలిలోనే ఊగిపోయింది...

‘‘ఇక్కడి తేయాకు తోటల్లో పని చేస్తున్నాం. ప్రతిరోజూ మా తోటల మీదుగా సైన్యం హెలికాప్టర్లు, విమానాలు వెళ్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ... ఈ రోజు హెలికాప్టర్‌ గాలిలోనే బాగా ఊగిపోవడం కనిపించింది. ఏదో ప్రమాదం జరిగిందేమో అని అనుకున్నాం. కొద్దిసేపటికే దూరంగా పెద్ద శబ్దం వినిపించింది. హెలికాప్టర్‌ కూలిపోయినట్లు ఆ తర్వాత తెలిసింది.’’

- తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కూలీలు


మంటల్లోంచి దూకారు

నేను చూస్తుండగానే హెలికాప్టర్‌ నుంచి ముగ్గురు వ్యక్తులు మంటల్లో కాలిపోతూ కిందకు దూకారు. క్షణాల్లోనే హెలికాప్టర్‌ నుంచి మంగలు వెలువడ్డాయి. అది చెట్టును ఢీకొంటూ కుప్పకూలింది. 

- మంజునాథ్‌, నంజప్ప సత్రం

Updated Date - 2021-12-09T08:14:50+05:30 IST