100 కోట్ల ‘మహా’బాంబు!

ABN , First Publish Date - 2021-03-21T07:33:48+05:30 IST

మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుకు షాక్‌..! బార్లు, రెస్టారెంట్ల నుంచి మామూళ్లు వసూలు చేయాలంటూ పోలీసులకు స్వయానా హోంమంత్రి పురమాయించారు..

100 కోట్ల ‘మహా’బాంబు!

బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్లు వసూలు చేసివ్వాలి

వాజేకు మహారాష్ట్ర హోం మంత్రి హుకుం

సీఎం ఉద్ధవ్‌కు మాజీ సీపీ పరమ్‌బీర్‌ లేఖ

ఆయనపై దావా వేస్తా: అనిల్‌ దేశ్‌ముఖ్‌

ఈ-మెయిల్‌ను పరిశీలిస్తున్నాం: సీఎంవో


అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారును పెట్టిన కేసులో ఇప్పటికే సచిన్‌ వాజే అరెస్టయ్యారు. ఆ కారు యజమాని మన్‌సుఖ్‌ హిరేణ్‌ అనుమానాస్పద మృతి కేసులోనూ వాజే హస్తంతో పాటు.. పరమ్‌బీర్‌ సింగ్‌ సహకారంపై ఆరోపణలున్నాయి. అరెస్టు భయంతోనే పరమ్‌బీర్‌ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై పరువునష్టం దావా వేస్తా. 

- ట్విటర్‌లో హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌


ముంబై, మార్చి 20: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారుకు షాక్‌..! బార్లు, రెస్టారెంట్ల నుంచి మామూళ్లు వసూలు చేయాలంటూ పోలీసులకు స్వయానా హోంమంత్రి పురమాయించారు..! అది కోటి రెండు కోట్లు కాదు.. నెలకు ఠంచనుగా రూ. 100 కోట్లు వచ్చి పడాలనేది ఆయన మౌఖిక ఆదేశాల్లోని సారాంశం..! ఈ విషయాన్ని చెప్పిందెవరో కాదు..! స్వయానా ముంబై మహానగరానికి పోలీసు కమిషనర్‌గా పనిచేసి, ఇటీవల హోంగార్డ్స్‌ విభాగానికి కమాండెంట్‌ జనరల్‌గా బదిలీ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరమ్‌బీర్‌ సింగ్‌. ఇటీవల సస్పెండ్‌ అయిన అదనపు ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేతోపాటు.. ఏసీపీ సంజయ్‌ పాటిల్‌కు ఈ టార్గెట్‌ను సూచించారని వెల్లడించారు. పరమ్‌బీర్‌ సింగ్‌ ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఎనిమిది పేజీల లేఖ రాశారు. ‘‘ముంబై మహానగరంలో మొత్తం 1,750 దాకా బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి నుంచి, ఇతర మార్గాల ద్వారా నెలకు రూ. 100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలి. ఒక్కో బార్‌/రెస్టారెంట్‌ నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా వసూలు చేసినా.. రూ. 50 కోట్లదాకా వస్తాయి’’ అని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన కిందిస్థాయి అధికారులను వసూళ్లకు పురమాయించే ప్రయత్నం చేశారని సీఎంకు రాసిన లేఖలో పరమ్‌బీర్‌ ఆరోపించారు. ‘‘ఫిబ్రవరి నెల మధ్యలో.. క్రైమ్‌ బ్రాంచ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇన్‌చార్జి, అదనపు ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే(హోంమంత్రి బంధువు)ను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నారు. తొలుత ఆయనకు ఈ టార్గెట్‌ సూచించారు.


వాజే వెంటనే నా దగ్గరకు వచ్చి, ఇదే విషయం చెప్పా రు. నేను ఒక్కసారిగా షాక్‌ తిన్నాను’’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివర్లో ఏసీపీ సంజయ్‌ పాటిల్‌నూ ఇలాగే పిలిపించారన్నారు. ‘‘హుక్కా పార్లర్లపై సమావేశానికి ఆయనను పిలిపించారు. ఆ తర్వాత మార్చి 4న మరోమారు పిలిపించారు. ఆ సమయంలో ఏసీపీ పాటిల్‌ వెంట డీసీపీ భుజ్‌బల్‌ కూడా ఉన్నారు. అప్పుడు హోంమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలండే ఏసీపీ వద్దకు వచ్చారు. 100 కోట్ల టార్గెట్‌ను గురించి చెప్పారు. ఈ తర్వాత.. పాటిల్‌ నా వద్దకు వచ్చి, విషయాన్ని వివరించారు. అప్పుడే అతణ్ని ఆశ్చర్యంతో అడిగాను.. నిజంగా అంత వసూలు చేసే అవకాశం ఉందా? అని. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాను. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో పురోగతిని మీకు(సీఎం) చెప్పేందుకు మార్చి మధ్యలో వచ్చినప్పుడు కూడా.. హోంమంత్రి తీరును వివరించాలనుకున్నాను’’ అని ఆయన లేఖ ద్వారా వివరించారు. ఆ తర్వాత తాను ఏసీపీ పాటిల్‌తో ఇ దే విషయమై ఈ నెల 16, 19 తేదీల్లో వాట్సా్‌పలో చాటింగ్‌ చేశానంటూ.. ఆ సంభాషణల సారాంశాన్నీ సీఎంకు పంపిన లేఖ మధ్యలో వివరించారు. 


ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?

తన వ్యక్తిత్వంపై మచ్చవేశారనే ఆక్రోశంతోనే ఈ విషయాలను బయటపెట్టినట్లు పరమ్‌బీర్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖను బట్టి తెలుస్తోంది. ‘‘మార్చి 18న హోంమంత్రి లోక్‌మత్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలు చేశారు. 34 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన నా బదిలీ వెనక పరిపాలనాపరమైన కారణాలేమీ లేవన్నారు. అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కారు కేసులో పరోక్షంగా మాదే వైఫల్యం అన్నారు’’ అని పరమ్‌బీర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. తన కిందిస్థాయి అధికారులను నేరుగా పిలిపించుకుని, వారికి ఆదేశాలు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. గత నెల దాద్రానగర్‌ అండ్‌ హవేలీ ఎంపీ ఆత్మహత్య కేసు దర్యాప్తులోనూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ తలదూర్చారని వివరించారు. పరమ్‌బీర్‌ లేఖ ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ దుమా రం రేపుతోంది. సొంత మెజారిటీ లేని శివసేనకు.. కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) మద్దతిస్తున్నాయి. 


హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఎన్సీ పీ సీనియర్‌ నేత. పరమ్‌బీర్‌ లేఖ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఠాక్రే తన మి త్రపక్షం నేతపై చర్యలు తీసుకుంటాడా? లేక.. చూసీ చూడనట్లు వదిలేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా.. విపక్ష బీజేపీకి అది ఓ కొత్త ఆయుధంలా మారనుంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా కోరారు. శివసేన మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా హోం మంత్రిని తప్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ ఆరోపణలపై శివసేన మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. పరమ్‌బీర్‌ లేఖ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంవో స్పందించింది. ‘‘మా రికార్డుల్లో పరమ్‌బీర్‌ మెయిల్‌ ఐడీ ఉంది. అయితే.. ఈ లేఖ ఆ మెయిల్‌ ఐడీ నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో.. అది నిజంగా పరమ్‌బీర్‌ ఈ-మెయిలేనా? అనే దాన్ని విశ్లేషిస్తున్నాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. 


వాట్సాప్‌ చాటింగ్‌ సారాంశమిదే..


ఈ నెల 16న..

పరమ్‌బీర్‌ సింగ్‌: పాటిల్‌.. ఫిబ్రవరిలో హెచ్‌ఎం(హోంమం త్రి)సార్‌ని కలిసినప్పుడు నగరంలో ఎన్ని బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయన్నారు? వాటి నుంచి ఎంత మొత్తాన్ని ఆశిస్తున్నారు?

ఏసీపీ పాటిల్‌: 1,750 బార్లు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయన్నారు. ఒక్కో బార్‌/వ్యాపార సంస్థ నుంచి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేస్తే.. నెలకు రూ. 50 కోట్లు వస్తుందన్నారు. ఈ నెల 4న హోంమంత్రి కార్యాలయానికి వెళ్లినప్పుడు.. డీసీపీ భుజ్‌బల్‌ ఎదుటే.. పలండే(హోంమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) ఈ టార్గెట్‌ను చెప్పారు.

పరమ్‌బీర్‌: అంతకు ముందు హెచ్‌ఎం సార్‌ను నువ్వెప్పుడు కలిశావు?

పాటిల్‌: హుక్కా పార్లర్లపై బ్రీఫింగ్‌ ఇవ్వడానికి నాలుగు రోజుల ముందు.

పరమ్‌బీర్‌: హెచ్‌ఎం సార్‌ను వాజే ఎప్పుడు కలిశారు?

పాటిల్‌: నాకు తేదీ సరిగ్గా గుర్తులేదు సార్‌.

పరమ్‌బీర్‌: మీ మీటింగ్‌కు కొన్ని రోజుల ముందేనని చెప్పావు కదా?

పాటిల్‌: అవును సార్‌. ఫిబ్రవరి చివర్లో..


ఈ నెల 19న

పరమ్‌బీర్‌: పాటిల్‌.. నాకు మరికొంత సమాచారం కావాలి. హెచ్‌ఎం సార్‌ను కలిశాక వాజే నిన్ను కలిశాడా?

పాటిల్‌: అవును సార్‌. ఆ వెంటనే నన్ను వాజే కలిశాడు.

పరమ్‌బీర్‌: హెచ్‌ఎం సార్‌ ఏం ఆదేశించాడో నీకు వాజే చెప్పాడా?

పాటిల్‌: 1,750 బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.50 కోట్ల దాకా వసూలు చేయాలని ఆదేశించినట్లు చెప్పాడు సార్‌. ఒక్కో బార్‌/రెస్టారెంట్‌ నుంచి నెలకు రూ 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు తీసుకోవాలన్నాడు.

పరమ్‌బీర్‌: ఓహ్‌..! హెచ్‌ఎం సార్‌ నీకు చెప్పిందే వాజేకు చెప్పినట్లున్నారు.

పాటిల్‌: మార్చి 4న హోంమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలండే నాకు ఈ విషయం చెప్పాడు సార్‌.

పరమ్‌బీర్‌: ఓహ్‌.. అవును. నువ్వు మార్చి 4న పలండేని కలిశావు కదా..!

పాటిల్‌: అవును సార్‌. వాళ్లు నన్ను పిలిపించారు.

Updated Date - 2021-03-21T07:33:48+05:30 IST