రేపు కాఫీ తాగొద్దంటారా?: మాంసం నిషేధంపై మండిపడ్డ హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-10T00:21:24+05:30 IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్లపై ఉన్న మాంసాహారం అమ్మే దుకాణాలను ఖాళీ చేయించడంపై గుజరాత్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘మీకు మాసం ఇష్టం లేకపోతే తినకండి. అది మీ సమస్య. మేం బయటికి వచ్చి ఏం తినాలని మాకు మీరు చెప్తారా? ఇలాగే పోనిస్తే..

రేపు కాఫీ తాగొద్దంటారా?: మాంసం నిషేధంపై మండిపడ్డ హైకోర్టు

అహ్మాదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్లపై ఉన్న మాంసాహారం అమ్మే దుకాణాలను ఖాళీ చేయించడంపై గుజరాత్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘మీకు మాసం ఇష్టం లేకపోతే తినకండి. అది మీ సమస్య. మేం బయటికి వచ్చి ఏం తినాలని మాకు మీరు చెప్తారా? ఇలాగే పోనిస్తే.. రేపు ఆరోగ్యం పాడవుతుంది కాఫీ కూడా తాగొద్దు అని చెప్పరని గ్యారెంటీ ఏంటి?’’ అని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని 25 వీధుల్లో గుడ్లు, చికెన్, చేపలు వంటి మాంసంతో చేసిన వంటకాలు అమ్ముతున్నారనే కారణంతో తమ దుకాణాలు తొలగించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా, ఆ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.


అయితే కోర్టు విచారణలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్యాలయం (ఏఎంసీ) తరపు న్యాయవాది మరో రకమైన వాదన వినిపించారు. రోడ్డు పక్కన ఈ దుకాణాలు ఉండడం వల్ల ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుందున్న కారణంతో మాత్రమే వాటిని తొలగిస్తున్నామని, మాంసాహారం అమ్ముతున్నారనే కారణంతో కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పిటిషన్‌లో పేర్కొన్న కారణాలకు సరైన సమాధానం ఏఎంసీ చెప్పలేకపోయిందని, ఇందులో దురుద్దేశాలు కనిపిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.


‘‘ఏదో అమలు చేస్తున్నారనే నెపంతో ఇంకేదో చేస్తున్నారనే మీ ఉద్దేశాలు అర్థమవుతూనే ఉన్నాయి. నిజాయితీగా మాట్లాడుకుంటే.. వస్త్రాపూర్ (అహ్మదాబాద్‌లోని ఓ ప్రాంతం) సరస్సు చుట్టూ గుడ్లు, ఆమ్లెట్లు అమ్ముతారు. అక్కడ గుడ్లు తినకూడదని అధికారంలో ఉన్నవారు నిర్ణయిస్తారా? వారి దుకాణాల్ని ఎత్తుకెళ్తారా? ఇది ఎవరు చేసినా దుర్మార్గమే. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? మీ కార్పొరేషన్‌ కమిషనర్‌ను అడగండి. లేదంటే అతడిని కోర్టు ముందు హాజరుపర్చండి మేమే అడుగుతాం’’ అని జస్టిస్ వైష్ణవ్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2021-12-10T00:21:24+05:30 IST