వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు

ABN , First Publish Date - 2021-01-13T07:29:53+05:30 IST

భారత ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలే అతిపెద్ద శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవి నియంతృత్వ పాలనకు కొత్త రూపమని,

వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు

దేశ భవిష్యత్తుకు అవే పెను ముప్పు

వారసత్వ నేతలకు చట్టమంటే భయమేదీ?

రాజకీయాల్లోకి యువత రావడమే పరిష్కారం

యువజన పార్లమెంటులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు


రాజకీయాల్లో చేరిన యువతను ఒకప్పుడు చెడిపోయిన వారిగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. నిజాయితీ, పనితీరుకు ప్రజలు పట్టం కడుతున్నారు. వారసత్వ రాజకీయాలను కూకటివేళ్లతో పెకలించాలి. పెద్ద ఎత్తున యువత రాజకీయాల్లోకి రాకపోతే వారసత్వ రాజకీయాలనే విషం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తూనే ఉంటుంది. 

- ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, జనవరి 12: భారత ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలే అతిపెద్ద శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవి నియంతృత్వ పాలనకు కొత్త రూపమని, దేశం అసమర్థ నేతలను మోయాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం ఆయన జాతీయ యువజన పార్లమెంటు ముగింపు వేడుకలో మాట్లాడారు. వారసులుగా ఉన్నత స్థానాల్లోకి వచ్చిన వారికి చట్టం పట్ల గౌరవం, భయం ఉండదని వ్యాఖ్యానించారు.


పూర్వీకులు చేసిన అవినీతికి శిక్ష పడకపోతే తమకు కూడా ఏమీ కాదన్న నమ్మకంతో వారసత్వ నాయకుల్లో చట్టం పట్ల భయం పోతుందని ప్రధాని అన్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వారసత్వ రాజకీయాలతో నడిచే కాంగ్రెస్‌ ను, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలిచే సంస్కృతి క్రమంగా బలహీనపడుతోందని చెప్పారు.


అయితే, ఈ వ్యాధి పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదన్నారు. వారసత్వ రాజకీయాలతో దేశ ప్రయోజనాల కన్నముందు ‘నేను, నా కుటుంబం’ అనేవి వచ్చి నిలబడతాయని చెప్పారు. హింస, అవినీతి, దోపిడీ రాజకీయాలను మార్చలేమని ఒకప్పుడు ప్రజలు భావించే వారని, రాజకీయాల్లో చేరిన యువతను చెడిపోయిన వాడిగా చూసేవారని అన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, ప్రజలు నిజాయితీ, పనితీరుకు పట్టం కడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ దేశానికి అతిపెద్ద సవాలు వారసత్వ రాజకీయాలేనన్నారు.


యువత రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున రాకపోతే వారసత్వ రాజకీయాలనే విషం ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనం చేస్తూనే ఉంటుందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివేకానందుని ఆదర్శాలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన స్వాతంత్య్ర ఉద్యమాన్ని కూడా ప్రభావితం చేశారని కొనియాడారు. ట్విట్టర్‌ ద్వారా కూడా మోదీ వివేకానందుడికి నివాళులు అర్పించారు.


Updated Date - 2021-01-13T07:29:53+05:30 IST