చెన్నైని వణికించిన వరుణుడు.. కుమ్మిపడేసిన వాన

ABN , First Publish Date - 2021-12-31T02:55:02+05:30 IST

వర్షం మరోమారు చెన్నైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది..

చెన్నైని వణికించిన వరుణుడు.. కుమ్మిపడేసిన వాన

చెన్నై: వర్షం మరోమారు చెన్నైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా నీటమునిగాయి. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వర్షం మొదలుకాగా, సాయంత్రం 5.30 గంటల సమయానికి 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.


ప్రముఖ వాతావరణ బ్లాగర్ ప్రదీప్ జాన్ అలియాస్ తమిళనాడు వెదర్‌మేన్ వర్షంపై ట్వీట్ చేశాడు. మైలాపూర్‌లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నాడు. ఇది 2015 నాటి వార్షిక వర్షపాతాన్ని అధిగమించినట్టు తెలిపాడు.


చెన్నై మీదుగా దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయని, చూస్తుంటే ఇప్పట్లో వర్షం తగ్గేలా కనిపించడం లేదని పేర్కొన్నాడు. ఇంటికి క్షేమంగా చేరుకోవాలని, టి.నగర్, అల్వార్‌పేట్, రోయపేట, నుంగా తదితర ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు అటువైపు వెళ్లొద్దని హెచ్చరించాడు.

Updated Date - 2021-12-31T02:55:02+05:30 IST