విమర్శలకు తాము వ్యతిరేకం కాదు : జవదేకర్

ABN , First Publish Date - 2021-02-26T20:39:02+05:30 IST

విమర్శలకు తమ ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని, తాము విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని

విమర్శలకు తాము వ్యతిరేకం కాదు : జవదేకర్

న్యూఢిల్లీ : విమర్శలకు తమ ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని, తాము విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే కొందరు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి, దేశం పరువు తీయాలని చూస్తున్నారని, వారి విషయంలోనే తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తు్న్నామని స్పష్టం చేశారు. టూల్‌కిట్ కేసులో దిశరవికి బెయిల్ మంజూరు విషయంలో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. దేశం పరువును తీయాలని చూస్తే ప్రజలు ఏమాత్రం ఊరుకోరని, తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, అయితే మర్యాదతో పాటు జాతీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అది కాంగ్రెస్ పాలన అయినా, జనతాదళ్ పాలన అయినా... మరే ఇతర ప్రభుత్వ పాలన అయినా ప్రధాని మోదీ వారు చేసిన సేవలను ప్రశంసించారని గుర్తు చేశారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందన్న విషయాన్ని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే మోదీ వ్యాఖ్యానించారని జవదేకర్ గుర్తు చేశారు. వీటన్నింటినీ గమనిస్తే తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకమని అర్థమవుతూనే ఉందని జవదేకర్ వివరించారు. 

Updated Date - 2021-02-26T20:39:02+05:30 IST