జమ్మూకశ్మీరు ఆరెస్సెస్‌ ఇన్‌చార్జి ఎవరో అందరికీ తెలుసు

ABN , First Publish Date - 2021-10-25T06:55:00+05:30 IST

జమ్మూకశ్మీరులో తనకు లంచం ఇస్తామన్న వ్యక్తి పేరు చెప్పడం సరికాదని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు.

జమ్మూకశ్మీరు ఆరెస్సెస్‌ ఇన్‌చార్జి  ఎవరో అందరికీ తెలుసు

ఆ వ్యక్తి పేరు చెప్పడం సరికాదు

‘లంచం’ ఆరోపణలపై మేఘాలయ 

గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ వ్యాఖ్యలు

ఎవరో.. ఏమిటో.. ఆయన్నే అడగండి: రాంమాధవ్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 24: జమ్మూకశ్మీరులో తనకు లంచం ఇస్తామన్న వ్యక్తి పేరు చెప్పడం సరికాదని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. కానీ, అప్పట్లో జమ్మూకశ్మీరు ఆరెస్సెస్‌ ఇన్‌చార్జి ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తాను జమ్మూకశ్మీరు గవర్నరుగా ఉన్న సమయంలో అంబానీ, ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుడికి చెందిన రెండు ఫైళ్లపై సంతకాలు చేస్తే రూ.300 కోట్లు లంచం ఇస్తామన్నారంటూ సత్యపాల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో ఈ నెల 17న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సత్యపాల్‌ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఆ వ్యక్తి పేరు చెప్పడం సరికాదు. కానీ, అప్పట్లో జమ్మూకశ్మీరు ఆరెస్సెస్‌ ఇన్‌చార్జిగా ఎవరున్నారో మీకు తెలుసు. నన్ను క్షమించండి. నేను ఆరెస్సెస్‌ సంస్థ గురించి ప్రస్తావించను. ఎవరైనా తన వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేసినా లేదా ఏదైనా వ్యాపారం చేసినా.. కేవలం అతని గురించే ప్రస్తావిస్తున్నా. అతను ఏ సంస్థకు చెందినవాడన్నది అనవసరం. ఆ సంస్థను ఈ అంశంలోకి లాగొద్దు’’ అని పేర్కొన్నారు. మరోవైపు సత్యపాల్‌ మాలిక్‌ ఆరోపణలపై సూరత్‌లో ఉన్న ఆరెస్సెస్‌ నేత రాంమాధవ్‌ను ప్రశ్నించగా.. ‘‘ఎవరో, ఏమిటో ఆయన్నే అడగండి’’ అని బదులిచ్చారు. అప్పట్లో జమ్మూకశ్మీరులోనే ఉన్నారుగా అన్న ప్రశ్నకు.. ‘‘ఆరెస్సె్‌సకు చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు. ఆయన ఏ అంశానికి సంబంధించి అలా చెప్పారో నాకు తెలియదు.


అసలు ఆయన అన్నారో, లేదో కూడా తెలియదు. మీరు ఆయన్నే అడగండి’’ అని రాంమాధవ్‌ సమాధానం ఇచ్చారు. మరోవైపు సత్యపాల్‌ మాలిక్‌ పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలపైనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ముఫ్తీ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని కూడా ప్రకటించారు. అయితే తాను మాట్లాడినవన్నీ వాస్తవాలనీ సత్యపాల్‌ చెప్పారు. ముఫ్తీ తనకు కూతురు లాంటిదన్నారు. ఆమెపై ఎన్నడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. ముఫ్తీ భూములు తీసుకున్నట్లు తాను చెప్పలేదని అన్నారు. ఆమె పేరు మీద పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ప్లాట్లు తీసుకున్నారని మాత్రమే చెప్పానని వివరించారు. ఆమె తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేసు కూడా పెట్టలేదని, పెట్టరని అన్నారు. ముఫ్తీ తనకు ఫోన్‌ చేసి, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారని.. అలాగే చేశానని తెలిపారు. ఆమెకు, తనకు మధ్య అలాంటి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించే ఉంటే... ఇంతటితో వదిలేయాలన్నారు. తాను చెప్పింది వాస్తవమని, అయినా ఎవరినైనా బాధించి ఉంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని సత్యపాల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-25T06:55:00+05:30 IST