పీఎం-సీఎంపై వివాదాస్పద పోస్టు పెట్టిన లా విద్యార్థి అరెస్టు!
ABN , First Publish Date - 2021-01-18T14:34:01+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై...
గోరఖ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఎల్ఎల్బీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ విద్యార్థిని క్రమశిక్షణ లేనివానిగా గుర్తిస్తూ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఈ విద్యార్థికి వర్శిటీలోకి అడుగు పెట్టేందుకు కూడా అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పారు.
వివరాల్లోకి వెళితే గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ తొలి సంవత్సరం చదువుతున్న అరుణ్ కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియో పోస్ట్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. అలాగే ఈ ఉదంతంపై దర్యాప్తునకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి యోగి ఢిల్లీలో కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటోను ఉపయోగించి అరుణ్ కుమార్ ఒక అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ అధికారులు ఆ విద్యార్థిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.