శెభాష్ వినయ్‌కుమార్ రెడ్డీ... తెలుగోడికి కేంద్ర ప్రముఖుల ప్రశంసలు...
ABN , First Publish Date - 2021-06-04T22:43:15+05:30 IST
: పెద్ద చదువులు చదివాడు. అమెరికాలో ఉన్నతోద్యోగం. మరెన్నో ఉద్యోగావకాశాలు. భారీ వేతనాలనిస్తామంటూ ఆఫర్లు... అయినా వాటిని వదులుకున్నాడు.
నిజామాబాద్/హైదరాబాద్ : పెద్ద చదువులు చదివాడు. అమెరికాలో ఉన్నతోద్యోగం. మరెన్నో ఉద్యోగావకాశాలు. భారీ వేతనాలనిస్తామంటూ ఆఫర్లు... అయినా వాటిని వదులుకున్నాడు. మాతృదేశంలోనే... పేదలకు సేవ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవు. ఉద్యోగాన్ని వదులుకుని, స్వదేశానికి వచ్చేశాడు. హైదరాబాద్ సహా పొరుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. ఈ క్రమంలో... పలువురు ప్రముఖులు, పెద్దల నుంచి ప్రశంసనలనందుకుంటున్నాడు. అతడే... నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సరికొండ వినయ్‌కుమార్(ఎస్‌వీకే రెడ్డి).
ఇక ఆయన సేవలను పలువురు కేంద్ర ప్రముఖులు కూడా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో రెడ్డి, తనమిత్రబృందంతో కలిసి దాదాపు 50 వేల వరకు మెడికల్ కిట్లను పంపిణీ చేసిన వైనాన్ని ప్రముఖలు ప్రశంసించడం విశేషం. కర్నాటక, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రూ. 35 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు రెడ్డి. ఇందుకు కావాల్సిన నిధుల విషయంలో... మిత్రులు, ఇతరత్రా సామాజిక సంస్థలు అండగా నిలిచాయి. హిందీ అగ్రనటుడు సోనూసూద్... ఒక కార్యక్రమంలో రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించం విశేషం. అలాగే మరెందరో ప్రముఖులు కూడా ఆయన సేవలకు కితాబిస్తుండడం గమనార్హం.
బ్రిటన్, దుబాయ్, అమెరికా, ఆస్ట్ల్రేలియా, రష్యా తదితర దేశాలకు చెందిన సెలబ్రిటీలు... ఆయనను ప్రశంసించారు. కాగా... కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలపడం, హిందీ నటుడు సోనూసూద్... ప్రత్యేకంగా అభినందించడం ఎప్పటికీ మరచిపోలేనంటాడు రెడ్డి. సేవా కార్యక్రమాల కోసం మిత్రబృందంతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ‘శ్రీ మాతంగేశ్వరీ హెల్పింగ్ హ్యాండ్స్’ తాను సభ్యునిగా ఉన్న మరికొన్ని ట్రస్టులతో కలిసి... త్వరలో కరోనా వ్యతిరేక పోరులో భాగంగా మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు రెడ్డి సమాయత్తమవుతున్నాడు.
కాగా త్వరలో ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంాలు, మురికివాడల్లో కూడా వినయ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలను చేపట్టనున్నాడు. జనరల్ మెడిసన్(ఎండీ) చదివి అమెరికాలో ఉన్నతోద్యోగం చేసిన వినయ్‌కుమార్ రెడ్డి... మరెన్నో ఉద్యోగావకాశాలు, లక్షల్లో జీతాన్ని వదులుకుని మరీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుండడం విశేషం.