గ్లోబల్ వార్మింగ్‌తో సముద్రాల్లో అలజడి

ABN , First Publish Date - 2021-05-18T23:31:56+05:30 IST

తౌక్టే తుపాను మహా ఉత్పాతానికి సంకేతమని హెచ్చరికలు వస్తున్నాయి

గ్లోబల్ వార్మింగ్‌తో సముద్రాల్లో అలజడి

న్యూఢిల్లీ : తౌక్టే తుపాను మహా ఉత్పాతానికి సంకేతమని హెచ్చరికలు వస్తున్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మహా సముద్రాల్లో ఏర్పడుతున్న మార్పులకు ఈ తుపాను ఓ సంకేతమని చెప్తున్నారు. దీనిని ‘సీ కప్పులో తుపాను’గా అభివర్ణిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల సముద్రాల్లో మార్పులు వస్తాయని, వాతావరణ రూపాల్లో మార్పులు జరిగి, తీర ప్రాంతాల్లోని పట్టణాలు నష్టపోతాయని చెప్తున్నారు. 


సుమారు వందేళ్ళలో తుపానుల చరిత్రను పరిశీలించినపుడు, ఎక్కువ తుపానులు బంగాళాఖాతంలోనే వచ్చాయని, అరేబియా సముద్రంలో తుపానులు తక్కువ అని వెల్లడైంది. సంవత్సరాలవారీగా సమాచారాన్ని పరిశీలించినపుడు, మన దేశంపై ప్రభావం చూపే తుపానులు ఐదు అనుకుంటే, వాటిలో నాలుగు  బంగాళాఖాతంలో ఏర్పడగా, ఒకటి అరేబియా సముద్రంలో ఏర్పడుతోంది. ఏప్రిల్-జూన్ మధ్యలో తుపానులు ఉండేవి కాదు. 


గడచిన నాలుగేళ్ళలో పరిస్థితిని పరిశీలించినపుడు, ఏటా బంగాళాఖాతంలో మూడు తుపానులు ఏర్పడుతుంటే, అరేబియాలో ఐదు తుపానులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ తీవ్ర తుపానుల వర్గీకరణలోకి రావడం మరింత దయనీయం. అంతకుముందు వచ్చిన మూడు తుపానుల కన్నా, తౌక్టే తుపాను తీవ్రత తక్కువ సమయంలోనే పెరగడం గమనార్హం. దీనికి కారణం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత నాలుగు దశాబ్దాల్లో పెరగడమేనని నిపుణులు చెప్తున్నారు. నీరు వేడెక్కి, ఆవిరిగా మారడం నుంచి తుపానులకు బలం వస్తుందని చెప్తున్నారు. అరేబియా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీలు పెరగడం వల్ల వచ్చే ఆవిరి, తేమ గాలి తుపానులకు శక్తిని అందిస్తున్నాయంటున్నారు. దీనికి మూల కారణం గ్లోబల్ వార్మింగ్, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అని చెప్తున్నారు. 


1900 నుంచి ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతున్నాయి. 1970 నుంచి కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలు దాదాపు 90 శాతం పెరిగాయి. ఖనిజ ఇంధనాలు మండటం, పారిశ్రామిక ప్రక్రియల వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు 78 శాతం మేరకు పెరిగాయి. కార్బన్‌డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరినేటెడ్ గ్యాసెస్ ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువులు. 


పారిశ్రామిక విప్లవం తర్వాత ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రారంభమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటే అప్పట్లో ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వేగం తక్కువగా ఉండేది. 1880 నుంచి 1980 వరకు పరిశీలించినపుడు ప్రతి దశాబ్దంలో సుమారు 0.07 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండేది. 1981 నుంచి పరిశీలించినపుడు ప్రతి దశాబ్దంలోనూ సుమారు 0.18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోంది. 


అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 సంవత్సరాలను 1880 నుంచి పరిశీలించినపుడు, తొమ్మిది సంవత్సరాలు 2005 తర్వాత కనిపిస్తాయి. మరోవైపు మంచుఖండాలు కరిగిపోతుండటం కూడా మనకు కనిపిస్తోంది. ఇటీవలే రుషి గంగ లోయలో ఓ మంచుఖండం సృష్టించిన అలజడిని గమనించాం. సముద్ర మట్టాలు పెరుగుతుండటం, వడగాడ్పులు, తుపానుల నుంచి వస్తున్న సంకేతాలను అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. Updated Date - 2021-05-18T23:31:56+05:30 IST