మరో ఐదేళ్ళు ఇవ్వండి, చొరబాట్లను ఆపుతాం : అమిత్ షా

ABN , First Publish Date - 2021-03-15T01:08:30+05:30 IST

కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపైనా కేంద్ర హోం

మరో ఐదేళ్ళు ఇవ్వండి, చొరబాట్లను ఆపుతాం : అమిత్ షా

దిస్‌పూర్ : కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపైనా కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆదివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోదని చెప్పారు. దేశాన్ని విభజించే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. మార్చి 27న ఎన్నికలు జరిగే అస్సాంలోని మర్గెరిటాలో జరిగిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. 


కాంగ్రెస్ పార్టీ అస్సాంను 15 సంవత్సరాలపాటు పరిపాలించినప్పటికీ, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రధాన మంత్రి ఉన్నప్పటికీ, పొరుగు దేశాల నుంచి అక్రమ వలసల సమస్యను పరిష్కరించేందుకు చేసినదేమీలేదని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దేనికైనా సిద్ధమవుతుందన్నారు. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్‌తోనూ, కేరళలో ముస్లిం లీగ్‌తోనూ, బెంగాల్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందన్నారు. అజ్మల్ చేతుల్లో పెడితే అస్సాం క్షేమంగా ఉండదని చెప్పారు. తమను శ్రద్ధగా చూసేది ఎవరో అస్సాం ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బద్రుద్దీన్ అజ్మల్‌‌లలో ఎవరు తమ సంక్షేమం కోసం పని చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. 


మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అమిత్ షా ఈ సభలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌ను పరోక్షంగా ప్రస్తావించారు.


బీజేపీ గత ఐదేళ్ళలో చొరబాటుదారులను విజయవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు. కాజీ రంగా నేషనల్ పార్క్ వద్ద స్థలాన్ని, మత సంబంధ స్థలాలను చొరబాటుదారులు ఆక్రమించుకున్నారని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించామని చెప్పారు. ఐదేళ్ళ క్రితం తాను బీజేపీ అధ్యక్షుడి హోదాలో అస్సాంకు వచ్చినపుడు అస్సాంను ఆందోళనల రహితంగా, తీవ్రవాద రహితంగా చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఆందోళనలు, తీవ్రవాదం ఉండవని స్పష్టం చేశారు. అస్సాంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. మరొక ఐదేళ్ళు తమకు ఇవ్వాలని, తాము చొరబాట్ల సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. 


తేయాకు తోటల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి తేయాకు తోటల కార్మికులు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. 


Updated Date - 2021-03-15T01:08:30+05:30 IST