ఆయన పాట అజరామరం

ABN , First Publish Date - 2021-12-26T15:48:05+05:30 IST

ఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలం ఘంటసాల పాట సజీవంగా వుంటుందని, మధురమైన ఆయన పాట అజరామరమని ప్రముఖులు కొనియాడారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శనివారం

ఆయన పాట అజరామరం

           - ఘంటసాల శతజయంతి సభలో ప్రముఖులు


చెన్నై: ఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలం ఘంటసాల పాట సజీవంగా వుంటుందని, మధురమైన ఆయన పాట అజరామరమని ప్రముఖులు కొనియాడారు. తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక పెరంబూరులోని డీఆర్‌బీసీసీసీ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు మాట్లాడుతూ.. ఘంటసాల శతజయంతి జరుపుకోవడం సంతోషంగా వుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీగేయ రచయిత, కవి భువనచంద్ర మాట్లాడుతూ.. ఘంటసాలను తలచుకోవడమంటే భగవంతుణ్ణి తలచుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఆయన ఏ పాట పాడినా, పద్యం ఆలపించినా అజరామరమేనని కొనియాడారు. ఘంటసాల తుదిశ్వాస విడిచే వరకూ ఎంతో వినయ విధేయతలతో ఉండేవారని, ఈనాటి యువతరం ఆయన జీవిత చరిత్రను చదవాలని సూచించారు. ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ ఆడిటర్‌, వేదవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి మాట్లాడుతూ.. మహా గాయకుడైన ఘంటసాలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు కేవలం ‘పద్మశ్రీ’ మాత్రం దక్కిందన్నారు. ఘంటసాల తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఘంటసాల మరణించి 47 సంవత్సరాలైనా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆయన పేరిట ఉత్సవాలు జరుపుకోవడం ముదావహమని పేర్కొంటూ.. సంఘం సేవలను ప్రశంసించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ.. భావితరాలకు ఘంటసాల గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరఫున అతిథులు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అదే విధంగా అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ‘లలిత గీతాంజలి ఆర్కెస్ట్రా’ అధినేత ఎంఆర్‌ సుబ్రమణ్యం బృందం ఘంటసాల గీతాలను ఆలపించింది. అదేవిధంగా జేకే రెడ్డి, భువనచంద్ర కూడా ఘంటసాల పాటలు, పద్యాలతో సభికులను రంజింప జేశారు. కార్యక్రమానికి సంఘం కార్యదర్శి పీఆర్‌ కేశవులు వ్యవహరిం చగా, అరుణ శ్రీనాథ్‌ ప్రార్థనా గీతం ఆలపిం చారు. కె.రమా దేవి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. 

Updated Date - 2021-12-26T15:48:05+05:30 IST