మూడో యుద్ధానికి సిద్ధం కండి!

ABN , First Publish Date - 2021-12-20T09:33:44+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

మూడో యుద్ధానికి సిద్ధం కండి!

  • వైద్య సిబ్బందికి అంతర్గత ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • సెలవుల రద్దు.. కొరత ఉన్నచోట తాత్కాలిక పద్ధతిలో భర్తీ
  • పల్మనాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్‌ల వివరాలకు ఆదేశం
  • ఒమైక్రాన్‌, పండుగల నేపథ్యంలో మరింతగా అప్రమత్తం


హైదరాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కొవిడ్‌ మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బందిని కూడా సంసిద్ధం చేస్తోంది. ఇప్పటికే వారి సెలవులను రద్దు చేసింది. సెలవులపై వెళ్లిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉన్నతాఽధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోధనాస్పత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఒమైక్రాన్‌ వ్యాప్తి పెరిగితే.. కొద్ది రోజుల తర్వాత నమోదయ్యే ప్రతి కేసు ఆ వేరియంట్‌దేనని పరిగణించాల్సి ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ వేరియంట్‌ స్వభావం రీత్యా సంక్రాంతి తర్వాత కేసులు పెరుగుతాయని వైద్య శాఖ అంచనా వేస్తోంది. కాగా సర్కారీ దవాఖానల్లో ఎంతమంది పల్మనాలజిస్టులు, జనరల్‌ ఫిజిషీయన్లు ఉన్నారో వివరాలు ఇవ్వాలని వైద్య శాఖ అన్ని ఆస్పత్రులను కోరింది. ప్రధానంగా బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఈ వైద్యులు తప్పకుండా ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఉన్నచోట.. మొదటి, రెండో వేవ్‌ తరహాలోనే  తాత్కాలిక పద్ధతిలో భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ఆలోచన చేస్తోంది.



ఈ నెల రోజులు కీలకం..

క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఉండడంతో రానున్న నెల రోజులు కీలకంగా మారనున్నాయి. పండుగల నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒమైక్రాన్‌ వ్యాప్తిని బట్టి.. జనవరి రెండో వారం నుంచి కేసులు రావొచ్చని వైద్య వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సర్కారీ దవాఖానల్లో ఇన్‌పేషెంట్లు 15 వేలు మించితే ఇబ్బందిగా మారుతుందని పేర్కొంటున్నాయి. ఇప్పటికే 112 ప్రభుత్వ, 1,215 ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొవిడ్‌ రోగుల చికిత్సకు అనుమతులున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిలో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇక సర్కారీ దవాఖానల్లో 15,009 సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లను సిద్ధం చేయగా, ప్రైవేట్‌లో మరో 39,236 పడకలను అత్యవసరం కింద అందుబాటులో ఉంచారు.


ఔషధాలు, మౌలిక వసతుల పరంగా..

ఎన్‌95 మాస్కులు: 41.11 లక్షలు, పీపీఈ కిట్లు:8.58 లక్షలు, 3 పొరల మాస్కులు: 149 లక్షలు, ఆర్టీపీసీఆర్‌ కిట్లు:2.91 లక్షలు, యాంటీజెన్‌ కిట్లు: 27.04 లక్షలు, హోం ఐసొలేషన్‌ కిట్లు: 8.71 లక్షలు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు:2.44 లక్షలు, పారాసిట్‌మాల్‌ మాత్రలు: 5.74 కోట్లు,  లెవోసిట్రిజన్‌ 5ఎంజీ: 2.59 కోట్లు, డెక్సామెథాజోన్‌ 0.5 ఎంజీ: 2.50 కోట్లు, అజిత్రోమైసిన్‌ 500ఎంజీ: 1.28 కోట్లు, డాక్సిసైక్లిన్‌ హెచ్‌సీఐ క్యాపుల్స్‌ 100 ఎంజీ: 1.65 కోట్లు, రోజువారి ఆక్సిజన్‌ కెపాసిటీ: 327 మెట్రిక్‌ టన్నులు.


రాష్ట్రంలో కొత్తగా 134 కేసులు

రాష్ట్రంలో ఆదివారం 25,900మందికి పరీక్షలు చేయగా 134మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైరస్‌తో ఒకరు చనిపోయారు. 3,693 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 82 నమోదయ్యాయి. విదేశాల నుంచి ఆదివారం 532 మంది రాగా.. ఒకరికి పాజిటివ్‌గా తేలింది.

Updated Date - 2021-12-20T09:33:44+05:30 IST