ప్రారంభానికి సిద్ధమైన గౌతం గంభీర్ ‘జాన్ రసోయి’..
ABN , First Publish Date - 2021-10-21T23:03:55+05:30 IST
టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ఈ శనివారం నాలుగో ‘జాన్ రసోయి’

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ఈ శనివారం నాలుగో ‘జాన్ రసోయి’ సెంటర్ను ప్రారంభించనున్నారు. లక్ష్మీబజార్ సమీపంలోని షకార్పూర్లో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇలాంటి మూడు సెంటర్లు ఢిల్లీలో సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ ప్లేటు భోజనం రూపాయికే లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు చెత్తను నిల్వ చేసేవారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడక్కడ దానిని తొలగించి ఆ స్థానంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు.
గౌతం గంభీర్ ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘జాన్ రసోయి’ కేంద్రాలు గాంధీనగర్, అశోక్ నగర్, వినోద్ నగర్లో సేవలు అందిస్తున్నాయి. వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇక్కడ ప్రతి రోజు మూడువేల మందికిపైగా రూపాయికే ప్లేటు భోజనం అందిస్తున్నారు. ఇక్కడ భోజనం చేసేవారిలో చాలామంది పేదలు, కరోనా లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్నవారే అధికం. ఇలాంటి వారికి సేవలు అందించడం తన విధి అని ఈ సందర్భంగా గౌతం గంభీర్ పేర్కొన్నారు.