కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2021-10-21T08:10:31+05:30 IST
కశ్మీర్‌లో బుధవారం వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ముష్కరులతో పోరాడుతూ ...

ఓ జవాన్ వీర మరణం
శ్రీనగర్, అక్టోబరు 20: కశ్మీర్‌లో బుధవారం వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ముష్కరులతో పోరాడుతూ ఓ జవాన్ వీరమరణం పొందారు. కుల్గాం, షోపియాన్ జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. కుల్గాం జిల్లాలోని ఆష్ముజి-దేవ్‌సర్ ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించిన బలగాలు లొంగిపోవాలని వారికి విజ్ఞప్తి చేశాయి. అయితే వారు బలగాల వైపు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. అలాగే షోపియాన్ జిల్లాలోని ద్రాగడ్ ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమవగా.. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.