నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2021-10-31T13:32:18+05:30 IST

ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆ నాలుగు జిల్లాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించారు. దాంతో అక్కడి అధికార

నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

- 2 రోజులు భారీ వర్షసూచన

- చెన్నై సహా పలుచోట్ల వానలు


చెన్నై(Tamilnadu): ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముండటంతో ఆ నాలుగు జిల్లాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించారు. దాంతో అక్కడి అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు చేపట్టింది. రెండు రోజులపాటు దక్షిణాది జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని  స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ పేర్కొన్నారు. ఇదిలా వుండగా శనివారం వేకువజాము చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో గంటకు పైగా భారీ వర్షాలు కురిశాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. చెన్నైలోని రాయపురం, రాయపేట, అడయార్‌, మధురవాయల్‌, ట్రిప్లికేన్‌, మైలాపూరు, షోళింగనల్లూరు, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి గంట పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కాగా ఈశాన్య రుతుపవ నాలు తీవ్రరూపం దాల్చ డంతో రెండు రోజుల పాటు కన్నియా కుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లో పలుచోట్ల భారీగా వర్షాలు కురవనున్నాయి. పుదుకోట, మైలాడుదురై, తంజా వూరు, తిరువారూరు, నాగపట్టినం, కడలూరు, విల్లుపురం, కాంచీపురం చెంగల్పట్టు, మదురై, సేలం జిల్లాల్లో పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పువియరసన్‌ తెలిపారు. నవంబర్‌ ఒకటిన దక్షిణాది జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నైలో మరో రెండు రోజులపాటు ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.


మూడు జిల్లాలను ముంచెత్తిన వర్షం

తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో శనివారం వేకువజామున భారీగా వర్షం కురిసింది. ఈ వర్షానికి తూత్తుకుడి రైల్వేస్టేషన్‌లో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. రైలు పట్టాలు నీటమునిగాయి. ఈ కారణంగా ముత్తునగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంట ఆలస్యంగా నడిచింది. తిరునల్వేలి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కుండపోతగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తామ్రభరణి వాగులో అదనపు జలాలను విడుదల చేస్తున్నారు. కన్నియాకుమారి జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీగా వర్షాలు కురిశాయి. నాగర్‌కోయిల్‌ అవ్వై షణ్ముగంసాలై, క్రిస్టియన్‌ కాలేజీ రోడ్డు సహా పలు రహదారులలో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. కొట్టారం, కుళిత్తురై, పూదపాండి, ఆరల్‌వాయిమొళి, రాణియల్‌ తదితర ప్రాంతాలు వేకువజాము కురిసిన వర్షాలకు జలమయమయ్యాయి.

Updated Date - 2021-10-31T13:32:18+05:30 IST